అమరావతి నిర్మాణానికి షరతులతో ఓకే...

SMTV Desk 2017-11-18 12:16:58  amaravathi, ngt, ap updates

అమరావతి, నవంబర్ 18: అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ట్రిబ్యునల్‌ షరతులతో కూడిన అనుమతులిచ్చింది. నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. పర్యవేక్షణకు, పరిశీలనకు రెండు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా కరకట్ట, కొండవీటి వాగు దిశను, సహజత్వాన్ని మార్చొద్దని పేర్కొంది. అమరావతిలో పర్యావరణ నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపడుతున్నారని 2015లో పండలనేని శ్రీమన్నారాయణ, కమలాకర్‌ జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జిటి)లో పిటిషన్‌ దాఖలు చేశారు. అనంతరం బొలిశెట్టి సత్యనారాయణ, మాజీ ఉన్నతాధికారి ఈఎఎస్‌ శర్మ ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యారు. పర్యావరణ అనుమతుల్లో పొందుపరిచిన నిబంధనలతోపాటు, ఎన్‌జిటి సూచించిన జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని జస్టిస్‌ స్వతంత్ర కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. పర్యవేక్షణ కమిటీకి జాతీయ పర్యావరణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, అమలు కమిటీకి రాష్ట్ర పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శిని చైర్మన్‌గా ఉంచాలని సూచించింది. కొండవీటి వాగు ప్రవాహ దిశను, కరకట్టను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చొద్దని ఆదేశించింది. నూతన రాజధాని నిర్మాణం వల్ల పర్యావరణ మార్పులపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు యాక్షన్‌ ప్లాను రూపొందించాలని సూచించింది. రాజధానిలో 251 ఎకరాల అటవీ భూమి ఉందని, ఈ భూమిని అటవీయేతర అవసరాలకు వినియోగించొద్దని పేర్కొంది. ఈ నిబంధనలన్నీ అమలవుతున్నాయో లేదో పరిశీలించేందుకు అమలు కమిటీ నెలకొసారి, పర్యవేక్షణ కమిటీ మూడు నెలలకోసారి సమావేశమవ్వాలని సమావేశ నివేదికలను ఎన్‌జిటికి సమర్పించాలని తీర్పునిచ్చింది. దీనిపై పిటిషనర్లు ఆనందం వ్యక్తం చేశారు. తాము చెబుతున్నదే నిజమైందని, ప్రస్తుతం కడుతున్న నిర్మాణాలన్నీ మార్చుకోవాల్సి ఉంటుందని పిటిషనర్‌ పండలనేని శ్రీమన్నారాయణ తెలిపారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం ఏకపక్షంగా చేసుకుపోయిందని, కమిటీల ఏర్పాటు వల్ల ప్రభుత్వ ఆటలు ఇక ముందు సాగవని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం చేస్తున్న చర్యలకు తీర్పు చెంపదెబ్బని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. కమిటీ పర్యవేక్షణకు ఆరుగురు సభ్యులతో రెండు కమిటీలు వేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి చైర్మన్‌గా ఉండే కమిటీలో ఎపి పర్యావరణ శాఖ అదనపు చీఫ్‌ సెక్రటరీ నోడల్‌ అధికారిగా ఉంటారు. రూర్కీలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ నామినేషన్‌ చేసే సీనియర్‌ సైంటిస్టు, బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ నామినేట్‌ చేసే సైంటిస్టు సభ్యులుగా ఉంటారు. ఎపి కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, సావిత్రి భాయీ పూలే యూనివర్శిటీ జియాలజీ ప్రొఫెసర్‌ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఎపి పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి చైర్మన్‌గా ఉండే అమలు కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ ప్రతినిధి, ఎపి కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ఐఐఎస్‌ బెంగుళూరు డైరెక్టర్‌ నియమించే సీనియర్‌ సైంటిస్టు, కృష్ణదేవరాయ యూనివర్శిటీకి చె౦దిన రిటైర్డ్‌ మైక్రో బయాలజీ ప్రొఫెసర్‌ సభ్యులుగా ఉంటారు.