మార్పు కోసం పనిచేద్దాం: సీఎ౦ కేసీఆర్

SMTV Desk 2017-11-18 11:11:14  kcr about st welfare, kcr, telangana govt updates

హైదరాబాద్, నవంబర్ 18: ప్రగతిభవన్‌లో శుక్రవారం ఎస్టీ ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై, గిరిజనుల సమస్యలపై చర్చించారు. ఓట్ల కోసం కాకుండా గిరిజనుల జీవితాల్లో నిజమైన మార్పుకోసం పనిచేయాలని, పేదరికాన్ని తరిమికొట్టేందుకు కృషిచేయాలని ఎస్టీ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉద్భోదించారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఎస్టీలు ఉన్నారని, వారిలో ఎక్కువమంది మారుమూల ప్రాంతాల్లో, ఏజెన్సీలలో సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ఎన్నోఏండ్లుగా ఉన్న ప్రత్యేక పంచాయతీల కోరిక నెరవేరుస్తున్నామని చెప్పారు. ఎస్టీలకు ఇంకా కొన్ని సమస్యలున్నాయి. ఎస్టీ ఆవాసప్రాంతాలు కొన్నింటిలో త్రీఫేజ్ కరెంటు రావటం లేదు. కొన్నిచోట్ల అసలు కరెంటు లేదు. రోడ్డు లేదు. మరికొన్నింటికి బస్సులేదు. ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలను గుర్తించే విషయంలో సమస్యలున్నాయి. పోడుభూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నవారికి ప్రభుత్వ సాయం అందించే విషయంలో కొన్ని చిక్కులున్నాయి. రెవెన్యూ, అటవీభూముల లెక్కలు తేలకపోవడంతో అక్కడక్కడ గిరిజనులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 1/70 చట్టం అమలు విషయం లో కూడా కొన్ని ఇబ్బందులున్నాయి. ఎస్టీ ధ్రువీకరణ పత్రాల విషయంలో సమస్యలున్నాయి. స్వయం ఉపాధి పథకాల్లో బ్యాంకుల నుంచి కాన్సెంట్ రావటం లేదు. ఫలితంగా ఆయా పథకాలు లబ్ధిదారులకు చేరటం లేదు. వీటన్నింటిపై ప్రభుత్వం కచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపెడుతుంది అని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలు, కొత్తగా ఏ పథకాలు ప్రవేశపెట్టాలనే విషయాలపై ఎస్టీ ప్రజాప్రతినిధులంతా శనివారం ఉదయం సమావేశం నిర్వహించుకొని తగిన ప్రతిపాదనలతో ప్రగతిభవన్‌కు రావాలని సూచించారు. సమావేశంలో ఎంపీలు సీతారాంనాయక్, గెడాం నగేశ్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, రవీంద్రకుమార్, రేఖానాయక్, కోవ లక్ష్మి, బాపురావు, మదన్‌లాల్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ రాములునాయక్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గాంధీనాయక్, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్, ఎమ్మెల్యేలు సత్యవతిరాథోడ్, మాలోత్ కవిత, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా, ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా, శాంతకుమారి, ఎస్టీ వెల్ఫేర్ కమిషనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.