దుర్వినియోగమవుతున్న ప్రజాధనం - వైకాపా ఎమ్మెల్యే

SMTV Desk 2017-06-11 16:20:10  TDP Government,MLA Chintala Ramchandrareddy, Nava nirmana deeksha

వాల్మీకిపురం, జూన్ 11 : రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణదీక్ష పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీంతో ప్రజానిధులన్నీ ఖాళీ అయ్యాయని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. ప్రజాప్రతినిధులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవనిర్మాణదీక్షలతో రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదన్నారు. కేవలం ప్రచార ఆర్భాటాల కోసమే దీక్షలను చేపట్టి వాటిని విజయవంతం చేసేందుకు అధికారులను ఉపయోగించుకుని గత వారం రోజులుగా రాష్ట్రంలో పాలనను స్తంభింప జేశారన్నారు. నవనిర్మాణదీక్షల పేరుతో అధికారులందరినీ తరలించారని, అయితే మండలస్థాయిలో పేద ప్రజలు వివిధ సమస్యలపై అధికారుల వద్దకు వస్తే వారు మాత్రం అందుబాటులో ఉండటం లేదన్నారు. గత వారం రోజులుగా ప్రభుత్వ పాలన పక్కదోవ పట్టిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెదేపా ప్రభుత్వం అమలు చేయకపోగా, ఇలాంటి ప్రచార ఆర్భాటాలతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని అన్నారు. సమావేశంలో సర్పంచులు చంద్రశేఖర్‌, కుమార్‌, వైకాపా జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు శ్రీధర్‌రాయల్‌, నాయకులు భాస్కర్‌నాయుడు, భాస్కర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, సీతాపతి, శ్రీనివాసులురావ్‌, రమేష్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు.