ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టనున్న కేంద్రప్రభుత్వం

SMTV Desk 2017-06-11 13:40:40  Prakasham district,Floride problem solving project

ఒంగోలు, జూన్ 11 : జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేసిందని, ఆ ప్రాజెక్టు కార్యాలయ ఏర్పాటుకు రూ.67 లక్షల నిధులనూ కేటాయించిందని ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్య వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాలు పని చేయకపోవడం, ఫ్లోరైడ్ విషప్రభావం వంటివి వ్యాధులు సంభవిస్తున్నాయని వాటిపై దృష్టిసారించి పని చేస్తున్న ఎంపీ, పిల్లల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనలను పలు మార్లు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో కేంద్ర వైద్య బృందం మార్చి 28వతేదీ జిల్లాలో పర్యటించింది. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారంపై చర్చించేందుకు ఐసీఎంఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (న్యూట్రీషన్‌ హెడ్‌) డాక్టర్‌ జి.ఎస్‌.తొతేజా, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ అర్జున్‌ కంథారియా, నిమ్స్‌ ఆసుపత్రి ఆచార్యులు డాక్టర్‌ టి. గంగాధర్‌ శనివారం హైదరాబాద్‌లో ఎంపీ సుబ్బారెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. జిల్లాలలో సమస్య పరిష్కారానికి కేంద్రం ఏడు ప్రత్యేక ప్రాజెక్టులను ఆమోదించిందని.. వాటిలో ప్రకాశం జిల్లాది తొలి ప్రాజెక్టు అని తెలిపారు. ఈ నెల 21వతేదీ ప్రత్యేక బృందం జిల్లాలో పర్యటించి తొలి విడత కార్యాచరణ ప్రారంభిస్తుందని వివరించారు. ఇప్పటికే జిల్లాకు ఫ్లోరైడ్‌ ట్రాన్‌సిట్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఫ్లోరైడ్‌ బాధితులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, అవకాశం ఉన్న ప్రాంతాల్లో సాగర్‌ జలాలను అందించాలని, ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. జిల్లాకు ప్రత్యేక ప్రాజెక్టు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.