పోగాకు కు జీఎస్ టీ దెబ్బ

SMTV Desk 2017-06-10 17:16:27  tobaco, gst, ongle, tobaco board

ఒంగోలు, జూన్ 10 : త్వరలో అమలు చేయనున్న వస్తు, సేవల పన్ను (జీఎస్ టీ) ద్వారా పొగాకు పరిశ్రమ మనుగడ సాగించలేదని భారత పొగాకు రైతుల సంఘం అధ్యక్షులు మిట్టపల్లి ఉమామహేశ్వర రావు ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్ టీలో పొగాకు పై 28 శాతం పన్ను విధిస్తే పొగాకు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని వెల్లడించారు. శుక్రవారం రైతు ప్రతినిధులతో సమావేశం నిర్వహించి జీఎస్ టీ తో వ్యాపారులు, రైతులు, పరిశ్రమ ఎదుర్కొనే ఇబ్బందులను వివరించారు. పొగాకు పై జీఎస్ టీ విధింపునకు సంబంధించి పొగాకు బోర్డు వద్ద ఎలాంటి సమాచారం లేదని, అయితే ఒక కేటగిరీలో 5 శాతం, మరో కేటగిరీలో 28 శాతం పన్ను విధించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసిందన్నారు. పొగాకు వ్యవసాయ ఉత్పత్తి కావడమే కాకుండా ఎగుమతులు చేసే పంటలు కావడం వల్ల మినహాయింపు ఉందని, అలాంటిది ఇప్పుడు 28 శాతం పన్ను విధిస్తే మెుత్తం ఈ రంగం ఉనికే ప్రమాదంలో పడుతుందని చెప్పారు. సాధారణ లాభాలతో ప్రస్తుతం విదేశాలకు ఎగుమతి చేస్తుండగా అంత మెుత్తం పన్ను విధిస్తే అనివార్యంగా ఆ మేర రైతులకు ఇచ్చే ధరలు తగ్గించడం తప్ప వ్యాపారులకు మరో మార్గం ఉండదన్నారు.