భాగ్యనగరానికి బాహ్య వలయ ముప్పు..

SMTV Desk 2017-11-11 13:20:55  POLLUTION IN HYDERABAD, OUTER RING ROAD, AIR POLLUTION.

హైదరాబాద్, నవంబర్ 11 : అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉన్న భాగ్యనగరం.. కాలుష్యపు కోరల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఇప్పటి నుండే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యపు కోరల ధాటికి పూర్తిగా కమ్ముకుపోయి పొగమంచులో వాహనాలన్ని ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు మరణించగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇప్పుడా కాలుష్యపు విషపు కోరలు హైదరాబాద్ ను వదలడం లేదు. ఉదయం దట్టమైన పొగమంచుతో ప్రయాణికులను అయోమయానికి గురిచేస్తూ, సాయంత్రానికల్లా తీవ్రమైన దుమ్ముతో రోడ్డు మొత్తాన్ని కప్పి వేస్తున్నాయి. ఇక అవుటర్ రింగ్ రోడ్డుపై వెళ్ళే వారు కాస్తంత చూసి నడపండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానమైన హైవేలతో జాతీయ రహదారులను అనుసంధానించడ౦ వల్ల బాహ్య వలయ రహదారి(అవుటర్ రింగ్ రోడ్డు)కి ప్రాముఖ్యత ఏర్పడింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వారు కాస్తంత దూకుడు తగ్గించి నెమ్మదిగా వెళ్ళండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ దారి వెంబడి అనేక ప్రమాదాలు జరిగే ఆస్కారం లేకపోలేదు. రోడ్లపై ఉన్న లైన్ల రంగు వెలిసిపోయి.. సరిగ్గా కనిపించక పోగా, విరిగిన సూచికలకు మరమ్మతులు చేయకుండా అలాగే వదిలేశారు. వీటన్ని౦టికి తోడు కొద్ది రోజులుగా ఉదయం పూట తీవ్రంగా మంచు కప్పేస్తోంది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకున్న మార్గంపై మరమ్మతులు చేస్తున్నారు. కొత్తది వేసేందుకు పాత పొరను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో దుమ్ము విపరీతంగా వెలువడుతోంది. దుమ్ము, మంచుతో ముందు వెళ్లే వాహనాలు స్పష్టంగా కనిపించడం లేదు. ఇవ్వన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు పలు జాగ్రత్తలు పాటించాల్సిందిగా నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.