ముస్లిం రిజర్వేషన్లు సాధించి తీరుతాం: కేసీఆర్

SMTV Desk 2017-11-10 11:44:24  kcr about Muslim reservation, telangana assembly updates, kcr

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను వంద శాతం సాధించి తీరుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తమిళనాడు తరహాలో పార్లమెంట్‌ ఆమోదంతో తొమ్మిదో షెడ్యూలులో చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివరించినట్లు తెలిపారు. దీనికి ప్రధాని సానుకూలంగా మాట ఇచ్చారని అన్నారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తెరాస ఎంపీలు ముస్లిం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తారని అన్నారు. దశాబ్ది కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మైనార్టీల కోసం కేవలం రూ.932 కోట్లు ఖర్చుపెడితే, మూడున్నరేళ్లలో తెరాస ప్రభుత్వం రూ.2,146 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ముస్లింలు ఈ దుస్థితిలో ఉండటానికి కాంగ్రెస్సే కారణమన్నారు. రిజర్వేషన్లు రాష్ట్రాల పరిధిలోని అంశం కాదనీ, కేంద్రం పరిధిలో ఉందని గుర్తించాలన్నారు. పదో షెడ్యూలులో ఉన్నందు వల్లే వక్ఫ్‌బోర్డు, ఉర్దూ అకాడమీ సహా వివిధ సంస్థలకు బాధ్యులను నియమించలేదన్నారు. ముస్లింల కోసం ఏర్పాటు చేసిన 216 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఇతరులకూ కొంత శాతం సీట్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని వక్ఫ్‌ భూములను కాపాడుతామన్నారు. విచారణ కమిటీ ద్వారా వాస్తవాలను నిగ్గు తేలుస్తామన్నారు. వక్ఫ్‌ చట్టం పటిష్టమైందని అన్నారు. తెలంగాణలో 750 ఏళ్ల ముస్లిం పాలకుల పాలనలో ఒక్కసారి కూడా మతకలహాలు జరగలేదని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో 900 ఉర్దూ ఉపాధ్యాయ పోస్టుల్ని ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ఈ సందర్బంగా ఆయన సభకు వివరించారు.