ట్రంప్ తో విప్రో కు ట్రబుల్

SMTV Desk 2017-06-10 15:33:45  tramp, wipro, america, president america

న్యూఢిల్లీ, జూన్ 10 : అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి నెలకొన్న పరిణామాలు తమ వ్యాపారాలపై భారీ స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపుతున్నదని విప్రో ఆందోళన వ్యక్తం చేసింది. అమె రికా మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్ఇసి కి పంపిన నివేదికలో విప్రో ఈ మేరకు వివరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు వినాశకరమని, అవి వ్యాపారాలను దెబ్బతీస్తాయని విప్రో పేర్కొంది. స్వేచ్చా వాణిజ్యానికి మోకాలడ్డడం తీవ్ర ఆందోళన కరమైన అంశమని పేర్కొంది. బెంగళూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న విప్రో ఐటి విభాగం ఆదాయాల్లో 52 శాతం అమెరికా కార్యకలాపాల నుండే వస్తున్నాయని అధ్యక్ష ఎన్నికల తర్వాత ప్రతికూల ప్రభావం వెల్లడవుతున్నదని వివరించారు. అమెరికా, యూరప్ లలో అస్థిర పరిస్థితులు కొనసాగి ఆర్థిక మార్కెట్లు మరింతగా క్షీణించినట్లయితే తమ సేవలపై నిర్ణయించిన ధరలు ఆకర్షణీయం కాక పోవచ్చునని పేర్కొంది. అలాగే ఆయా దేశాల్లోని తమ క్లయింట్లు టెక్నాలజీ పై చేసే వ్యయాలను తగ్గించడం లేదా వాయిదా వేయడానికి ఆస్కారం ఉన్నదని , ఇది కూడా వ్యాపారాలను దెబ్బతీస్తుందని వివరించారు. భారత్ లోను, తాము కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర దేశాల్లోను కూడా రాజకీయ అస్థిరతలు, నియంత్రణాపరమైన మార్పుల వంటివి తమ చేతిలో లేని పరిణామాలని తెలియజేసింది. ట్రంప్ యంత్రాంగం స్వేచ్చా వాణిజ్యం పై కఠిన ఆంక్షలు విధించడంతో పాటు అమెరికాలోకి దిగుమతి అయ్యో వస్తువులపై సుంకాలు భారీగా పెంచేసిందని వివరించింది. అమెరికాలో సామాజిక, రాజకీయ, నియంత్రణా పరమైన అంశాల్లో పరిస్థితులు మారడం, విదేశీ వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు, విధానాల్లో మార్పులు వ్యాపారాలను బాగా దెబ్బతీస్తాయని విప్రో వెల్లడించింది. జనవరి 20న అధికార పగ్గాలు చేపట్టిన ట్రంప్ హెచ్ 1 బి వీసాలను సమీక్షించాలంటూ కార్యనిర్వాహ ఉత్తర్వు జారీ చేశారని..ఈ విషయమై భారత ఐటి రంగం అప్పుడే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని వివరించారు. అమెరికాలో తాము ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టి ఉండడం మూలంగా వ్యాపారాలు ప్రభావితం కాకుండా చూసుకునేందుకు స్థానికులను అధిక సంఖ్యలో నియ మించుకుంటామని ప్రకటించడం జరిగిందని వివరించారు.