టీఆర్టీ నియామకాలు నిలుపుదల.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు...

SMTV Desk 2017-11-10 11:03:39  Teacher recruitment testing notification, High Court Respond, state government,

హైదరాబాద్, నవంబర్ 10 : ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ నోటిఫికేషన్ కు సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు కేవలం పాత జిల్లాలకే వర్తిస్తుంటే 31 జిల్లాలతో కూడిన నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారంటూ..? హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు జిల్లా కేడర్ పోస్టులకు వర్తించవని ప్రభుత్వం వాదించగా.. ఇందుకోసం లోతైన విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నిబంధనలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 10 న జారీ చేసిన జీవో నంబర్ 25, తదనుగుణంగా విడుదలైన ఉపాధ్యాయ నియామక పోస్టుల నోటిఫికేషన్ పై హైకోర్టు పలు పశ్నలు సంధించింది. టీఆర్టీ నోటిఫికేషన్ ను సవాలు చేస్తూ అదిలాబాద్ జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ మరో ముగ్గురితో కలిసి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. 31 జిల్లాల ప్రాతిపదికగా నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల పాత జిల్లాలో ఉన్న అనేక మంది అభ్యర్థులు కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల స్థానికేతరులుగా మారిపోతున్నారని వారి తరపున న్యాయవాది వాదించారు. ఉపాధ్యాయ పోస్టులు జిల్లా కేడర్ అని, రాష్ట్రపతి ఉత్తర్వులు ఈ పోస్టులకు వర్తించవని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వివరించగా దీనిపై ధర్మాసనం సంతృప్తి చెందలేదు. ఈ వివాదం తేలే వరకు టీఆర్టీ నిర్వహించరాదని సూచించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు పది జిల్లాలకే వర్తిస్తుంటే 31 జిల్లాల ఆధారంగా నోటిఫికేషన్ ఎలా విడుదల చేస్తారంటూ ప్రశ్నించింది. ఈ సందర్భంగా కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలంటే రాష్ట్రపతే తగిన మార్పు చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.