భారత తొలి ఓటరు ఎవరో తెలుసా!

SMTV Desk 2017-11-09 19:24:04  about india first voter, shyam sharan negi,

సిమ్లా, నవంబర్ 09: తొలి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసిన భారత తొలి ఓటరు శ్యాం శరణ్‌ నేగి హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లోను ఓటు హక్కు వినియోగించుకున్నారు. కల్పా పోలింగ్‌ కేంద్రంలో నేగి తన ఓటు వేశారు. పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చిన నేగిని అధికారులు మర్యాదపూర్వకంగా స్వాగతించారు. 100ఏళ్ల వయస్సులోనూ ఆయన స్వయంగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయడం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. స్వాత్రంత్యం వచ్చిన తొలినాళ్లలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మొట్టమొదటి భారతీయుడు నేగి. 1952 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు కారణంగా ఐదు నెలల ముందే అంటే 1951 అక్టోబర్‌లో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో మండి పార్లమెంట్‌ నియోజకవర్గంలో నేగి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. నేగి 1917 జులై 1న హిమాచల్‌లోని కల్పాలో జన్మించారు. ప్రస్తుతం ఆయనకు 101ఏళ్లు. అయినా సరే క్రమం తప్పకుండా అన్ని ఎన్నికల్లోనూ ఆయన ఓటు వేస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు ప్రకటించారు.