వక్ఫ్ రికార్డుల జప్తు పూర్తి: కలెక్టర్ యోగితా రాణా

SMTV Desk 2017-11-09 14:55:30  about vakf lands, telagana govt vakf lands attach, vakf lands

హైదరాబాద్, నవంబర్ 09: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వక్ఫ్ బోర్డు ఆస్తుల రికార్డులను హైదరాబాద్ కలెక్టర్ యోగితా రాణా ఆధ్వర్యంలోని రెవెన్యూ బృందాలు జప్తు చేశాయి. ఈ ప్రక్రియ మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు జరిగింది. ఆర్డీఓ చంద్రకళ నేతృత్వంలో 5గురు ఎమ్మార్వోల బృందం హజ్ హౌజ్ లోని మొదటి, మూడు, నాలుగు, ఏడు, ఎనిమిదో అంతస్తుల్లోని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయాల విభాగాల్లోని భూ రికార్డులను స్వాధీనం చేసుకొని 20 గదుల్లో 220 బీరువాల్లో భద్రపరిచారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు కోట్లాది విలువైన భూములను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని, వేలాది ఎకరాల భూములను అన్యాక్రాంతం చేశారని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ వక్ఫ్ బోర్డ్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 77,538 ఎకరాలకు పైగా భూములు ఉండాలి. వీటిలో దాదాపు 57,424 ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రికార్డుల ప్రక్షాళనకు నలుగురు సీనియర్ అధికారులతో కమిటీ ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. కబ్జా కు గురైన భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీన పర్చుకోవాలని భావిస్తుంది.