నిరూపించకపోతే ఈటెలను రోడ్లపై తిరగనివ్వం: మంద కృష్ణ మాదిగ

SMTV Desk 2017-11-09 11:04:13  manda krishna about rajendar, bharathi death news, manda krisna updates

హైదరాబాద్, నవంబర్ 09: నియంతల వ్యవహరిస్తున్న కేసీఆర్ వల్లే ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మృతి చెందిందని మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదా, ఇది రాచరికపు పాలన కాదా అని ఆయన ప్రశ్నించారు. దళితుల, మహిళలు, మాదిగలు పట్ల కేసీఆర్ కు గౌరవం లేదని, ఉంటే ఒక్క మంత్రి పదవి కూడా ఎందుకు ఇవ్వలేదని ఆయన అన్నారు. పోలీసుల అండతో ప్రభుత్వాన్ని ఎన్నో రోజులు నడపలేరని, మహిళా పోలీసులు బలంగా ఆమెను నెట్టడం వల్లే చనిపోయిందని, దీనికి కేసీఆరే బాధ్యత వహించాలని, ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారతి ఫిట్స్ తో చనిపోయిందని ఈటల అన్నారని, దాన్ని నిరూపించకపోతే ఈటెలను రోడ్లపై తిరగనివ్వమని హెచ్చరించారు. పోలీసుల చర్యను ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని, అందుకే రూ. 25 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారని మండిపడ్డారు. భారతి మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రేపట్నుంచి 19వ తేదీ వరకు రెండు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలను చేపడతామని, 20న భారతి సంస్మరణ సభ నిర్వహిస్తామని మంద కృష్ణ తెలిపారు.