పొగమంచుకు ఆవిరైన నిండు ప్రాణాలు...

SMTV Desk 2017-11-08 18:46:06  road accident, panjab, Amarinder Singh, Batinda District,

భటిండా, నవంబర్ 8 : పొగమంచు కారణంగా నిండు ప్రాణాలు ఆవిరైన ఘటన పంజాబ్ లోని భటిండా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బుచోమండి వద్ద కళాశాల, కోచింగ్‌ క్లాస్‌లకు వెళ్తున్న విద్యార్థుల బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో బస్సు ఆగిపోయింది. దీంతో దాదాపు 14 మంది విద్యార్థులు వేరే బస్సు కోసం భటిండా- ఛండీగఢ్‌ హైవే రోడ్డు పక్కన నిలబడ్డారు. అదే సమయంలో అటువైపు గా వస్తున్న లారీ వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారును ఢీ కొట్టిన తర్వాత ఆ వాహనం విద్యార్థుల మీదకు దూసుకెళ్లింది. దీంతో దాదాపు 9 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం పొగ మంచు వల్ల లారీ డ్రైవర్ కు ఎదురుగా వచ్చేవి ఏం కనిపించకపోవడమేనని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.