అంతుచిక్కని గమ్యం.....! నెరవేరిందా లక్ష్యం....?

SMTV Desk 2017-11-08 15:48:45  analysis about demonitisation, demonitisation result,

న్యూ ఢిల్లీ, నవంబర్ 08: దేశీయ ఆర్ధిక రంగాన్ని భారీ స్థాయిలో కుదిపేసిన వివాదాస్పదమైన ప్రభుత్వ విధాన చర్య పెద్ద నోట్ల రద్దు. ఇది దేశీయ ఆర్ధిక రంగం పై చెరగని ముద్ర వేసింది. దీనివల్ల దేశానికీ దీర్ఘకాలిక ఆర్ధిక ప్రయోజనాలుంటాయని ప్రభుత్వం చెబుతుంటే, దేశాన్ని తిరోగమనంలోకి నెట్టిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నిజానికి పెద్ద నోట్ల రద్దు దేశానికి అవసరమా? ప్రపంచంలో మంచి జోరు మీదున్న భారత్ ఆర్ధిక రంగానికి అది ఎంత మేలు చేసిందో ఇప్పటికి అంతు చిక్కని ప్రశ్న. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున హడావుడిగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించాక చలామణిలో ఉన్న నోట్లలో 86 శాతం చెల్లుబాటు కాకుండా పోయాయి. ప్రజల చేతిలో నగదు లేకుండా పోయి అనేక ఇబ్బందులు పడ్డారు. జీడీపీ వృద్ధిరేటు గణనీయంగా పడిపోయింది. జనవరి-మార్చ్ త్రైమాసికంలో ఇది 6.1 గా నమోదై, ఏప్రిల్- జూన్ లో 5.7 గా క్షీణించి౦ది. అసంఘటిత, సంఘటిత రంగాలు కుదేలై లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయి కార్మికులు, చిరు ఉద్యోగులు రోడ్డున పడ్డారు. పేదలపై దీని ప్రభావం ఇప్పటికి ఉంది. దాదాపుగా రద్దైన నోట్లన్నీ బ్యాంకుల్లో డిపాజిట్ కాగా, ఎంత నల్లధనం బయటకు తీసారో ప్రభుత్వం, ఆర్‌బీఐ దగ్గర ఎటువంటి లెక్కలు లేవు. డిజిటల్ ఎకానమీ అంటూ కొత్త పల్లవి అందుకుంది కేంద్ర ప్రభుత్వం. సంక్లిష్టమైన భారత్ వంటి ఆర్ధిక వ్యవస్థలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్‌బీఐ, ప్రభుత్వ ఆర్దిక ప్రధాన సలహాదారుడు, ఇతర తల పండిన ఆర్థికవేత్తలను విశ్వాసంలోకి తీసుకోకుండా, పర్యవసానాలను అంచనా వేయకుండా నిర్ణయం తీసుకోవడం అవగాహన రాహిత్యం అంటున్నారు విశ్లేషకులు. రద్దైన నోట్లను వినూత్న వ్యూహాలతో బ్యాంకులకు చేర్చిన నల్లధన కుబేరులు అసాధారణ౦గా వ్యవహరించారు. ఇప్పుడు ప్రభుత్వం బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించింది. ఈ లావాదేవీల ఆధారంగా ఐటీ నోటీసులు జారి అవుతున్నాయి. ఇదిలావుంటే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రేరా వంటి చట్టాలతో రియాల్టీ రంగ౦ కుదేలయింది. రియాల్టి ధరలు తగ్గుతాయని ప్రభుత్వం చెప్తుంటే, కొనుగోలుదారు సెంటిమెంట్ పడిపోయిందని సర్వే లు చెప్తున్నా యి. ఏదే మైనా నోట్ల రద్దు, జీఎస్టీ తో స్వల్పకాలిక ప్రభావం ఉన్నా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు౦టాయని, ఆర్ధిక వ్యవస్థ కోలుకుంటు౦దని ప్రభుత్వం చెబుతుంటే, దేశంలోని వాస్తవిక పరిస్థితులు, పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలు, ఇంటర్నెట్ వ్యాప్తి, సంపద పంపిణీలో అసమానతలు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటే బాగుండేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సంస్కరణలు దేశ ఆర్దికాభివ్రుద్దికి అవసరమే కానీ సరైన హోం వర్క్ చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ తప్పిదమే అని ఆర్థికవేత్తల అభిప్రాయం.