పాల్వాయి మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

SMTV Desk 2017-06-10 13:04:09  cm kcr Shocked about Palwao Govardhan Reddy, friday morning died

హైదరాబాద్, జూన్ 10 : రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం రోజు ఉదయం కన్నుమూశారు. పార్లమెంటరీ స్థాయి సంఘ సభ్యుడిగా హిమాచల్ ప్రదేశ్ లోని కులూ పర్యటనకు వెళ్లిన పాల్వాయి, అక్కడే తీవ్ర గుండెపోటుకు గురై చికిత్స పొందేలోపు కన్నుమూశారు. దీంతో పాల్వాయి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పాల్వాయితో తనకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశానికి పాల్వాయితో పాటు హాజరైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పాల్వాయి భౌతికకాయాన్ని కులు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. పార్ధివదేహా తరలింపుతో పాటు అవసరమైన అన్ని కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించాలని ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డిలకు సీఎం సూచించారు. పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా ఆయన స్వగ్రామమైన చండూరు మండలం ఇడికుడ గ్రామంలో శనివారం నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.