అమీర్ పేట్ కు మెట్రో ట్రయల్స్....

SMTV Desk 2017-11-08 14:06:53  ameerpet to nagole metro Trials, Interchange Station

హైదరాబాద్, నవంబర్ 08 : మూడేళ్లుగా మెట్రో పనులతో ఇబ్బంది పడిన ఆ ప్రాంతవాసులు, వ్యాపారులు మంగళవారం రాత్రి మెట్రోపరుగులు చూసి సంతోషం వ్యక్తం చేశారు. మూడేళ్లకు పైగా శ్రమపడిన వందల మంది కార్మికులకు ఫలితం లభించింది. పదుల సంఖ్యలో ఇంజినీర్లు మూడు నెలలుగా రాత్రింబవళ్లు చేసిన కృషి ఫలించింది. మెట్రోరైలు మార్గంలో కీలకమైన అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌కు మంగళవారం రాత్రి మెట్రోరైలు చేరుకుంది. బేగంపేట దాటి గ్రీన్‌ల్యాండ్స్‌ మీదుగా అమీర్‌పేటకు మెట్రోరైలు రావడం ఇదే మొదటిసారి. ఆకాశమార్గంలో చీకట్లను చీల్చుకుంటూ మెట్రో పరుగులు తీస్తూ అమీర్‌పేట స్టేషన్‌లో కాసేపు ఆగింది. అనంతరం తిరిగి నాగోల్‌ డిపోకు చేరుకుంది. అయితే, మెట్రో రైలు ప్రాజెక్టులో ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తిగా భిన్నమైంది. రెండు వేర్వేరు కారిడార్లను కలిపే జంక్షన్‌ ఈ ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌. ఉదాహరణకు నాగోల్‌ నుంచి మియాపూర్‌ వెళ్లాల్సిన వ్యక్తి ఒకే మెట్రో రైల్లో వెళ్లలేడు. కచ్చితంగా అమీర్‌పేటలో దిగి రైలు మారాల్సిందే. ఇక్కడే, ఒకవైపు నుంచి వచ్చిన రైలు రెండో అంతస్తులో.. మరో వైపు నుంచి వచ్చిన రైలు మూడో అంతస్తులో ఆగుతాయి. ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాల ఆధారంగా రైళ్లు మారాల్సి ఉంటుంది. అందుకే వీటిలో, ఒకేసారి నాలుగు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించేలా నిర్మాణాలు ఉంటాయి. ప్రతి మెట్రో స్టేషన్‌ రెండంతస్తులు ఉంటే.. ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌ మాత్రం మూడంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్తు పూర్తిగా టికెటింగ్‌, షాపింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌! అయితే, రెండు, మూడు అంతస్తుల్లో ప్లాట్‌ఫామ్స్‌ ఉంటాయి. దీనిని 2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. అమీర్‌పేట ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్‌ పొడవు 476 అడుగులు. కాగా, వెడల్పు 148 అడుగులు. భూమి నుంచి స్టేషన్‌ పైకప్పు ఎత్తు 112 అడుగులు. ఇక్కడి నుంచి ఒక్క రోజులో 30 వేల మంది ప్రయాణికులు సాఫీగా ప్రయాణం చేసేలా ఏర్పాట్లు చేశారు. ఒకేసారి 6 వేలమంది స్టేషన్‌లో ఉండేలా విశాలంగా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఇతర నిర్మాణాలను శరవేగంగా రూపుదిద్దుతున్నారు. కాగా, ఈ నెల 28న ప్రధాని మోదీ చేతులమీదుగా దీనిని ప్రారంభించనున్నారు.