మరో పన్ను ప్రవేశపెట్టే ఆలోచనతో మోదీ...?

SMTV Desk 2017-11-08 12:36:37  Indian Prime Minister Narendra Modi, Banking Transaction Tax - BTT

న్యూఢిల్లీ, నవంబర్ 08 : డిసెంబర్ లో నిర్వహించే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో సాహసోపేత నిర్ణయానికి సిద్ధమై, ప్రకటించాలని భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో ఆదాయపన్ను సహా అన్నింటినీ రద్దు చేసి వాటి స్థానంలో బ్యాంకు లావాదేవీల పన్ను (బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ -బీటీటీ) విధించాలని మోదీ యోచిస్తున్నట్టు సమాచారం. బీటీటీతోపాటు మద్యం, పొగాకు వంటి ప్రజల ఆరోగ్యానికి హాని చేసే వస్తువులపై వినియోగ పన్ను (కన్జంప్షన్ ట్యాక్స్) కూడా విధించాలన్నది మోదీ అభిప్రాయంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న విధానంలో ప్రభుత్వం పన్నుల వసూలు కోసం ప్రజల వెంట పడుతున్న విషయం తెలిసిందే. బీటీటీ కనుక అమల్లోకి వస్తే ఇక ఆ అవసరం ఉండదు. ఎదావిధిగా పన్నులు వసూలవడంతో, పన్ను ఎగవేతకు అవకాశం ఉండదు. ఈ మేరకు మోదీ ప్రవేశపెట్టాలని చూస్తున్న బీటీటీకి వాణిజ్య వర్గాలు కూడా మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. మోదీకి నోట్ల రద్దు సలహా ఇచ్చిన పుణెకు చెందిన అర్థక్రాంతి ప్రతిష్ఠాన్ వ్యవస్థాపకుడు అనిల్ బోకిల్ తొలిసారి ఈ ప్రతిపాదన తెచ్చినట్టు తెలుస్తోంది. ఇలా వచ్చిన ఆదాయంతో కేంద్రానికి 0.7 శాతం, రాష్ట్రానికి 0.6 శాతం, స్థానిక సంస్థలకు 0.35 శాతం, లావాదేవీ జరిగిన బ్యాంకుకు 0.35 శాతం చొప్పున లభిస్తుంది.