కాపర్ డ్యాం పనులను ఆపండి : కేంద్రం

SMTV Desk 2017-11-08 12:34:02  polavaram project, coper dam, central government rules.

అమరావతి, నవంబర్ 08 : వచ్చే ఏడాది కల్లా గ్రావిటీ ద్వారా నీళ్ళను అందించేలా పరుగులు పెడుతున్న పోలవరం ప్రాజెక్ట్ పనులకు అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో అత్యంత కీలకమైన కాపర్ డ్యాం నిర్మాణాన్ని నిలిపివేయాలని కేంద్ర జల వనరుల శాఖ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. అసలు కాపర్ డ్యాం నిర్మాణ౦ ఏ మేరకు అవసరమో తక్షణమే ఓ కమిటీ ఏర్పాటు చేసి నిర్ధారించాలని జాతీయ జల విద్యుత్ సంస్థను ఆదేశించింది. తాత్కాలిక ఆటకట్టుగా ప్రధాన డ్యాంకు ఎగువన, దిగువన నిర్మించే కాపర్ డ్యాం నిర్మాణం వల్ల ప్రయోజనం లేదని నేరుగా ప్రధాన ఆనకట్టు అయిన ఎర్త్ కం రాక్ఫిల్ డ్యాం నిర్మాణమే చేపట్టవచ్చని కేంద్ర౦ అభిప్రాయపడుతోంది. తద్వారా ప్రాజెక్ట్ వ్యయం గణనీయంగా తగ్గుతోందని అంచనా వేస్తోంది. వాస్తవానికి ఈ నవంబర్ లో గోదావరి నది తగ్గుముఖం పట్టడంతో కాపర్ డ్యాం నిర్మాణంలో భాగంగా నది గర్భంలో నిర్మాణాన్ని చేపట్టాలని ప్రణాళికలు రచించారు. జర్మనీకి చెందిన కెల్లర్ సంస్థ జెట్ గ్రౌటింగ్ యంత్రంతో పనులు కూడా చేపట్టింది. రాక్పిల్ డ్యాం కంటే ముందుగా ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎగువ భాగంలో 2.3 కి.మీ., దిగువన 1.4 కి.మీ. పొడవైన తాత్కాలిక మట్టి కట్టను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 42.5 అడుగుల ఎత్తైన కాపర్ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేసి 2018 నాటికి పోలవరం కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీరివ్వాలని సంకల్పించింది. తాత్కాలిక మట్టి కట్ట నిర్మాణం పూర్తయితే దాదాపు 120 టీఎంసీల నీరు నిల్వ చేసే వీలున్నందున నవంబర్ లో పనులు ప్రారంభి౦చి జులై కల్లా పూర్తవ్వాలని నిర్దేశించుకుంది.