అశ్లీల సమాచారాన్ని తొలగించేందుకు ఇండోనేసియా సిద్ధం...

SMTV Desk 2017-11-07 19:28:17  Pornographic information, Indonesia is ready to remove

జకర్తా, నవంబర్ 07 : ముస్లిం ప్రధాన దేశమైన ఇండోనేసియాలో సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తుంటారు. ఈ నేపథ్యంలో అశ్లీల సమాచారాన్ని ఇంటర్నెట్‌ నుంచి తొలగించేందుకు ఇండోనేసియా సిద్ధమైంది. ఈ మేరకు గూగుల్‌ సహా, ఇతర సర్వీస్‌ ప్రొవైడర్లను తమ నెట్‌వర్క్‌లో అలాంటి కంటెంట్‌ ఉండకుండా తొలగించాలని సూచించడంతో, ఆ దేశ కమ్యూనికేషన్‌, సమాచార మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ శామ్యూల్‌ వ్యాఖ్యానించారు. అంతకుముందు సోమవారం వాట్సాప్‌కు ఇదే తరహా హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజుల సమయంతో మెసెంజర్‌లో ఉండే అశ్లీలతతో కూడిన గ్రాఫికల్‌ ఇంటర్‌ఛేంజ్‌ ఫార్మాట్‌ (జిఫ్‌) ఇమేజులను తొలగించాలని సూచించింది. అయితే, ఎన్‌క్రిప్షన్‌ కారణంగా అది సాధ్యపడదని వాట్సాప్‌ చెప్పింది. వాట్సాప్‌లో థర్డ్‌ పార్టీ సంస్థలు ఈ సేవలు అందిస్తాయని పేర్కొంది. ఆయా సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆ విషయాన్ని సూచించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో జిఫ్‌ ఇమేజ్‌లు అందించే టెనార్‌ సంస్థ మంగళవారం అలాంటి కంటెంట్‌ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. త్వరలో గూగుల్‌ సహా ఇతర సంస్థలు కూడా దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు.