మహిళలకు వేధింపులా...ఆన్‌లైన్‌ వేదికకు ఫిర్యాదు చేయండి..

SMTV Desk 2017-11-07 17:59:38  Online platform, womens Security, Union Minister Maneka Gandhi

న్యూఢిల్లీ, నవంబర్ 07 : ప్రస్తుత సమాజంలో మహిళలపై లైంగిక దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పని చేసే ప్రదేశాల్లో కూడా మహిళలు వేధింపులకు గురవుతుండటంతో కేంద్రం కొన్ని చర్యలు చేపట్టింది. ఎక్కడైనా మహిళలు వేధింపులకు గురవుతే ఫిర్యాదు చేసేందుకు ఆన్‌లైన్‌ వేదికను ప్రవేశ పెట్టింది. ఈ మేరకు ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన పోర్టల్‌ను కేంద్రమంత్రి మేనకా గాంధీ నేడు ప్రారంభించారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ‘షీ బాక్స్‌’ (సెక్సువల్‌ హరాస్‌మెంట్‌ ఎలక్ట్రానిక్‌ బాక్స్‌) పేరిట ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు గల సంస్థ తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కోసం కమిటీని ఏర్పాటు చేయాలని పని ప్రదేశంలో లైంగిక వేధింపుల చట్టం- 2013 పేర్కొంటోంది. ఈ ఆన్‌లైన్‌ వేదిక ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి మంత్రిత్వ శాఖ అధీనంలోని ప్రత్యేక విభాగం పనిచేస్తుంది. ప్రతి ఫిర్యాదును ఈ విభాగం సంబంధిత సంస్థలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)కి పంపిస్తుంది. ఐసీసీ విచారణ స్థితిని కూడా ఎప్పటికప్పుడు ఈ పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా దేశంలో వేధింపులకు గురవుతున్న మహిళల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంపిక చేసింది.