వేలు చూపించింది.. జాబ్ పోగొట్టుకుంది...

SMTV Desk 2017-11-07 16:00:54  donald trump, Julie Briskman job issue, viral photo.

వాషింగ్టన్, నవంబర్ 07 : వేలు చూపించడం వల్ల ఏకంగా ఉద్యోగమే పోయింది. అదేంటి..? అని ఆశ్చర్యపడుతున్నారా..! అసలు విషయం ఏంటంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కాన్వాయ్‌లో గోల్ఫ్‌ కోర్సుకు వెళ్తున్నారు. అదే సమయంలో జూలీ బ్రిస్క్‌మ్యాన్‌ అనే 50 ఏళ్ల మహిళ స్టెర్లింగ్‌లో సైకిల్‌పై వెళ్తొంది. ఈ క్రమ౦లో వాహనాలు తనను దాటుతు౦డగా ఆమె తన చేతి మధ్య వేలిని ట్రంప్‌ కాన్వాయ్‌ వైపు చూపించింది. ఆ కాన్వాయ్‌ వెంట వెళ్తున్న ఓ ఫొటోగ్రాఫర్‌ ఆమె ఫొటోను తీసి, సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ అయిపోయింది. ఇదంతా జరిగి దాదాపు నెల రోజులైంది. అయితే ఈ ఘటనను అనేక కార్యక్రమాల్లో ప్రస్తావించడం వల్ల ఆమె ఉద్యోగానికి ఎసరు వచ్చింది. బ్రిస్క్‌మ్యాన్‌.. వర్జీనియాకు చెందిన అకీమా అనే కాంట్రాక్టర్‌ వద్ద మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ స్పెషలిస్ట్‌ గా పని చేస్తో౦ది. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఆ సంస్థ యాజమాన్యం ఆమెపై మండిపడుతూ ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా తమ పేరు దెబ్బతిందని ఉద్యోగం నుంచి తొలగించింది. చిత్రమేమిటంటే ఈ ఘటన గురించి ఆమె ఎలాంటి విచారణను వ్యక్తం చేయకుండా సానుకూలంగా స్పందించారు.