మధ్యప్రదేశ్ లో మరో మృగం...

SMTV Desk 2017-11-07 11:43:12  rape case, dewas, madhya pradesh,

దేవాస్, నవంబర్ 7 : ఇటీవల మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో నలుగురు వ్యక్తులు కలిసి ఓ కళాశాల విద్యార్ధిని పై సామూహిక అత్యాచారం చేసిన ఘటన మరువకముందే మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని పదేళ్ల చిన్నారిపై ఓ మృగం పశు వాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత చంపేసి పొలంలో పడేశాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... దేవాస్‌ జిల్లా సుంద్రెల్‌ గ్రామానికి చెందిన బాలిక శుక్రవారం సాయంత్రం తన తండ్రి కోసమని పొలానికి భోజనం తీసుకెళ్లింది. అనంతరం ఆమె జాడ తెలియ రాకపోగా.. ఆదివారం ఉదయం వారి పొలానికి అర కిలోమీటరు దూరంలోనే అత్యంత దారుణ స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు. బాలిక మృతదేహంపై అనేక చోట్ల పళ్ళతో కొరికిన గాట్లున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించిన వైద్యులు, ఫొరెన్సిక్‌ నిపుణుల నివేదిక ప్రకారం - బాలికపై అత్యాచారం జరిపి, ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేలింది. ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.