భారత్- కివీస్ మధ్య నేడే తుది పోరు..పొంచి ఉన్నవరుణుడు..

SMTV Desk 2017-11-07 10:17:30  india- newzeland 3 rd t-20, tiruvnanthapuram, series 1-1 equal, kohli, dhoni

తిరువనంతపురం, నవంబర్ 07 : భారత్-కివీస్ మధ్య నిర్ణయాత్మక మూడో టీ- 20 ఈ రోజు తిరువనంతపురం వేదికగా జరగనుంది. ఇక్కడ ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటికే సిరీస్ ను 1-1 తో సమం చేసిన ఇరు జట్లు ఈ మ్యాచ్ ను ఎలాగైనా గెలిచి టీ-20 కప్ ను తమ కైవసం చేసుకోవాలని ఎదురు చూస్తున్నాయి. భారత్ జట్టు మొదటి మ్యాచ్ లో ఘన విజయం సాధించి, రెండవ పోరులో అన్ని రంగాల్లో విఫలమై ఓటమిని మూటకట్టుకుంది. కివీస్ ఆటగాళ్ళు ప్రస్తుత ఫాం పరంగా చాలా బలంగా కన్పిస్తున్నారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే కోహ్లి సేన చాలా శ్రమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్ జట్టు బ్యాటింగ్ విభాగంలో సమతూకంగా ఉన్న సరైన సమయంలో ఆటగాళ్ళు ఒత్తిడిని తట్టుకోలేక వికెట్లు సమర్పించుకుంటున్నారు. గత మ్యాచ్ లో కోహ్లి, ధోని రాణించిన మిగతా బ్యాట్స్ మెన్ నుండి సహకారం లేకపోవడంతో పరాజయం చవిచూడాల్సివచ్చింది. ఇక బౌలింగ్ విభాగంలో బుమ్రా, భువనేశ్వర్ పొదుపుగా బౌలింగ్ చేసి తమ వంతు పాత్ర పోషిస్తుండగా, స్పిన్నర్ లు తోడ్పాటు అందిస్తే భారత్ విజయం సులభమవుతుంది. ప్రత్యర్ధి జట్టు గత మ్యాచ్ విజయం తో ఆత్మవిశ్వాసంగా బరిలోకి దిగుతుంది. న్యూజిలాండ్ జట్టులో బ్యాటింగ్ మెరుపు వీరులకు కొదవలేదు. క్రిందటి టీ-20 లో సెంచరీ వీరుడు మున్రోతో పాటు కెప్టెన్ విలియమ్స్ న్, గుప్తిల్, లాథం చెలరేగాలని భావిస్తున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బౌల్ట్, ఇషి సోది, సాన్‌ట్నర్‌ భారత్ బ్యాటింగ్ ను చాలా ఇబ్బంది కి గురిచేస్తున్నారు. ఏది ఏమైనా రెండు జట్ల బలాబలాలను పరిశీలిస్తే ఈ మ్యాచ్ హోరా హోరిగా సాగడం ఖాయం. అయితే ఈ మ్యాచ్ కు వరుణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.