మేడారం జాతరకు అంతర్జాతీయ స్థాయి: ఈటల రాజేందర్

SMTV Desk 2017-11-06 18:11:28  conduct of medaram jaathara

హైదరాబాద్, నవంబర్ 06: ప్రతి రెండేళ్లకొకసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర. సమ్మక్క, సారక్క జాతరగా ప్రసిద్ధిగాంచిన ఈ జాతరకు కోటి మంది వరకు భక్తులు హాజరవుతారు. తెలంగాణ మణి హారంగా సాగే ఈ జాతర నాలుగు రోజుల వరకు జరుగుతుంది. అశేష భక్త జనులు అమ్మ వార్లకు బంగార౦ తో మొక్కులు చెల్లించి కోరికలు తీర్చుకుంటారు. ఇంత ఘనంగా జరిగే మేడారం జాతర గురించి సోమవారం శాసనసభలో లఘు చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి రాజేందర్ సమాధానమిస్తూ, అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టు జాతరను నిర్వహిస్తామని చెప్పారు. జాతరను నిర్వహించడానికి ఆర్థిక సాయం చేయాలంటూ కేంద్రాన్ని కోరామని తెలిపారు. గత ప్రభుత్వాలు జాతర నిర్వహణ కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వరకు మాత్రమే నిధులను కేటాయించేవని, తమ ప్రభుత్వ౦ వచ్చిన తర్వాత జాతర కోసం రూ. 100 కోట్లు కేటాయించామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతరకు ఇప్పటికే రూ. 80 కోట్లు విడుదల చేశామని, అవసరమైతే మరిన్ని నిధులను విడుదల చేస్తామని ఆయన సభకు తెలిపారు. ఆలయాల అభివృద్దికి కేసీఆర్ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు రాజేందర్ తెలిపారు.