ఎమ్మార్పీఎస్‌ ఆందోళనలో అపశృతి..

SMTV Desk 2017-11-06 16:41:48  mrps agitation,women died, 25 lakshs X Grecia

హైదరాబాద్, నవంబర్ 06 : దశాబ్దాలుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరు ఉధృతమైంది. ప్రతిపక్షంలో ఉండి హామీలు ఇచ్చి, అధికారంలోకి రాగానే మొండి చేయి చూపిస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని ఎమ్మార్పీఎస్‌ భావించి ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడికి ప్రయత్నించారు. ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తోపులాటలో భారతి అనే నాయకురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, భారతి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన మృతురాలి కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉన్నదని, త్వరలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని సీఎ౦ తెలిపారు. కాగా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ ప్రజా ఆందోళనలను అణచి వేస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ ఆరోపించింది.