దస్తావేజు లేఖరులకు ప్రత్యేక నిబంధనలు

SMTV Desk 2017-06-09 18:33:22  Telangana Registrations department,Document writer,Sub-Registrar,Licence

హైదరాబాద్,జూన్ 9 : అక్రమాలకు అత్యంత ప్రసిద్ది చెందిన రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖలో సంస్కరణలు ఊపందుకున్నాయి. రిజిస్ట్రేషన్లలో ముఖ్యమైన దస్తావేజులను రాసే బాధ్యతలను అర్హత కలిగిన వ్యక్తులకు ఇవ్వాలని, దస్తావేజూ లేఖరుల కు అనుమతి పత్రాలు (లైసెన్స్) జారీ చేస్తే అక్రమాలకు తెర దించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. నిజానికి 2000 సంవత్సరానికి ముందు రిజిస్ట్రేషన్ శాఖలో అనుమతి పొందిన దస్తావేజు లేఖరులే ఉండేవారు. దాని తర్వాత కార్ట్ (కంప్యూటరైజుడ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటు) విధానాన్ని ప్రవేశపెట్టడంతొ అప్పటి ప్రభుత్వం దస్తావేజు లేఖరులను తొలగించింది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ఆ తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖలో మధ్యవర్తులకు మంచి అవకాశంగా మారింది. దళారులు సబ్ రిజిస్ట్రార్ లకు డబ్బు ఆశ చూపించడంతో వాళ్ళు కూడా భారి స్థాయిలో అక్రమాలకు వెనుకంజ వేయడం లేదు. అర్హత కలిగిన వారికి దస్తావేజు లేఖరులుగా లైసెన్స్ ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో సుమారు 3 వేల మంది నిరుద్యోగులకు అవకాశం ఉందని అంచనా. రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్ , జిల్లా రిజిస్త్రార్ కార్యాలయలుండగా...ప్రతి ఒక కార్యాలయానికి కనీసం 15 మంది చొప్పున నియమించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్టు సమాచారం. దీనికి కనీస అర్హత డిగ్రీ కాగా.. న్యాయశాస్త్రం చదివిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని రిజిస్ట్రేషన్ ల శాఖ నిర్ణయం తీసుకుంది. దస్తావేజు రాసినందుకు రూ. 10 లక్షల లోపు విలువైన డాక్యుమెంట్ కు రూ.1000 , రూ.50 లక్షల లోపు విలువైన దస్తావేజుకు 2000 రూపాయల చొప్పున లేఖరులకు ఫీజు చెల్లించాలని ప్రభుత్వం వివరించింది. అనుమతి పత్రాలను ఇవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్లలో జరిగే తప్పులకు వారిని కూడా బాధ్యులుగా పరిగణించాలని భావిస్తున్నారు.