రియాద్ విమానాశ్రయ౦పై క్షిపణి దాడి

SMTV Desk 2017-11-05 11:57:50  saudi airport, riyad airport, Houthi insurgency in Yemen,

రియాద్, నవంబర్ 5 : రియాద్ విమానాశ్రయమే లక్ష్యంగా క్షిపణి దాడి ప్రయోగం ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఈ దాడికి యెమన్‌లోని హౌతీ రెబల్స్‌ పాల్పడ్డారు. క్షిపణి దాడిని తామే చేశామని యెమన్‌లోని హౌతీ ఆధీనంలోని ప్రభుత్వ మంత్రి ఒకరు ప్రకటించారు. సౌదీ రాజధానిని షాక్‌కు గురిచేయడానికే ఈ దాడి చేశారని, దేశీయంగా తయారు చేసిన బుర్ఖన్‌ 2హెచ్‌ అనే దీర్ఘ శ్రేణి క్షిపణిని ఈ దాడికి ఉపయోగించినట్లు తెలిపారు. ఇటీవల యెమన్‌ రాజధాని సనాపై సౌదీ సంకీర్ణ దళాల దాడికి ప్రతిస్పందనగా రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడి వల్ల విమానాల రాకపోకల్లో ఎటువంటి మార్పు లేదని సౌదీ ప్రభుత్వం పేర్కొంది. 2015 తర్వాత సౌదీపై ఈ స్థాయిలో దాడి జరగటం ఇదే తొలిసారి. ఈ ఘటనతో సౌదీ యెమన్‌ మధ్య విభేదాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉగ్రవాదులకు మద్దతు పలికే దేశాలే హౌతీ రెబల్స్‌కు సహకరించాయని పరోక్షంగా ఇరాన్‌ను నిందించింది. సకాలంలో పేట్రియాట్‌ రక్షణ వ్యవస్థ స్పందించి ఆ క్షిపణిని దారిలోనే కూల్చివేసింది. దీంతో రియాద్‌ విమానాశ్రయం సురక్షితంగా ఉందని సౌదీ ప్రభుత్వం తెలిపింది.