కృష్ణా నీటి కేటాయింపులపై భిన్న వాదనలు

SMTV Desk 2017-11-05 10:40:53  krisha river dispute issue, allocation of krishna water, krishna board chairman srivasthava statement

హైదరాబాద్, నవంబర్ 04: కృష్ణా నది యాజమాన్య బోర్డు శనివారం సమావేశమై నీటి కేటాయింపులు గురించి చర్చించింది. బోర్డు చైర్మన్ శ్రీవాత్సవ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నత అధికారులు పాల్గొని చర్చించారు. నీటి పంపిణీ మినహా మిగిలిన అనేక అంశాలపై తీవ్రస్థాయిలో వాదోపవాదాలు, చర్చలు జరిగినా పలు అంశాలపై తుది నిర్ణయానికి రాలేదు. నీటి వినియోగంపై విస్తృతంగా చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం కేటాయిస్తూ నిర్ణయం జరిగిందని, సమావేశం అనంతరం బోర్డు చైర్మన్‌ శ్రీవాత్సవ తెలిపారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ తుది అవార్డులోని క్లాజ్‌-7 ప్రకారం తాగు నీటికి కేటాయించే నీటిలో 20 శాతాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవాల్సి ఉందని తెలంగాణ పేర్కొనగా, పులిచింతలలో వినియోగాన్ని కూడా లెక్కగడుతున్నందున ఇది అవసరం లేదని ఏపీ పేర్కొనడంతో ఆ ప్రతిపాదనకు ఆమోదం లభించలేదని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ 63:37 శాతం ప్రకారం వాడుకోవాలని తెలంగాణ సూచించగా, 70:30 శాతం ఉండాలని ఏపీ కోరింది. మధ్యేమార్గంగా 65:35 శాతాన్ని బోర్డు ఛైర్మన్‌ సూచించగా, చివరకు 66:34 శాతాన్ని ఖరారు చేశారు. గోదావరి నీటిని మళ్లించుటపై తెలంగాణ వాదనతో ఏపీ ఏకీభవించక పోవడంతో ఈ అంశాన్ని పక్కనపెట్టారు. పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నీటిని మళ్లించి రికార్డుల్లో మాత్రం తక్కువ చూపిస్తున్నారని తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వహణను బోర్డు చేపట్టాలని లేదంటే ఏ రాష్ట్రం పరిధిలో ఉన్న హెడ్‌ వర్క్స్‌ను ఆ రాష్ట్రమే నిర్వహించుకోవాలని ఏపీ ప్రతిపాదించింది. సాగు, తాగు నీటి విడుదలకు సంబంధించి బోర్డు జారీ చేసే ఆదేశాల ప్రకారమే ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి విద్యుదుత్పత్తి చేపట్టాలని నిర్ణయించారు. పులిచింతలను ఉమ్మడి ప్రాజెక్టుగా గుర్తించాలనీ, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు డ్యాం మొత్తం శాంతిభద్రతల పర్యవేక్షణ తమకే అప్పగించాలన్న తెలంగాణ ప్రతిపాదనలకు ఏపీ అంగీకరించలేదు. నీటి పంపిణీని 66:34 శాతంగా బోర్డు నిర్ణయించడంతో ప్రస్తుతం ఉన్న నీటిలో ఏపీకి 215 టీఎంసీలు, తెలంగాణకు 115 టీఎంసీలు వస్తాయని అంచనా. ఇప్పటి వరకు పట్టి సీమ నుంచి వచ్చిన నీటితో సంబంధం లేకుండా ఏపీ 107.5 టీఎంసీలు వినియోగించుకొంది. తెలంగాణ 50.371 టీఎంసీలు వాడుకొంది.