చైనాకు దీటుగా భారత్..!!

SMTV Desk 2017-11-04 19:08:36  bharath, chaina, Air bases, India to face China Defense strategies.

న్యూఢిల్లీ, నవంబర్ 04: ఒక ప్రక్క భారత్ ను మిత్రదేశంగా భావిస్తూనే, మరో ప్రక్క యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ భిన్న ప్రకటనలు చేస్తున్న చైనాను ఎదుర్కొనేందుకు భారత్ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. మిత్రులం అంటూనే సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాను ఎదుర్కొనేందుకు భారత్‌ మెరుపువేగంతో రక్షణ వ్యూహాలకు పదునుపెడుతోంది. దీనిలో భాగంగా లద్ధాఖ్‌ సమీపంలో మరిన్ని వైమానిక స్థావరాలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. సంక్షోభ సమయంలో సేనల్ని మరింత వేగంగా సరిహద్దులకు తరలించేందుకు వీలుగా వీటిని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. లద్ధాఖ్‌ ప్రాంతంలో అతి శీతల పరిస్థితుల కారణంగా ఆయా ప్రదేశాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తే అత్యవసర సమయాల్లో సేనల్ని వేగంగా తరలించేందుకు అవకాశం ఉంటుందని రక్షణ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వివాదాస్పద డోక్లాం వంటి శీతల ప్రాంతాలకు వెళ్ళాలంటే వాయుమార్గంపై ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. ఇందుకు గాను ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న న్యోమ ఎయిర్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టు ఇప్పుడు ప్రాణం పోసుకుంటోంది. ప్రస్తుతం దీనిని రవాణా విమానాలు దిగే స్థాయిలో అభివృద్ధి చేయవచ్చు. ఇది తూర్పు లద్ధాఖ్‌లో చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంది. 1960లో దీనిపై చివరిసారి విమానం ల్యాండ్‌ అయింది. దీంతోపాటు చుసూల్‌ ఎయిర్‌ ఫీల్డ్‌పై కూడా వైమానిక దళం ఆసక్తి చూపుతోంది. ఈ విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతల్ని వైమానిక దళం పర్యవేక్షించే అవకాశం ఉంది.