దూర విద్య ఇంజినీరింగ్‌ కోర్సును రద్దు : సుప్రీంకోర్టు

SMTV Desk 2017-11-04 11:51:31  Canceling Distance Education Engineering Course, supremcourt, delhi

న్యూఢిల్లీ, నవంబర్ 04 : నాలుగు డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు దూర విద్య ద్వారా అందించిన డిగ్రీ కోర్సులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.కె.గోయల్‌, జస్టిస్‌ యు.యు.లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. జేఆర్‌ఎన్‌ రాజస్థాన్‌ విద్యాపీఠ్‌ (జేఆర్‌ఎన్‌), రాజస్థాన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్డ్‌ స్టడీస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (ఐఏఎస్‌ఈ), అలహాబాద్‌ అగ్రికల్చరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఏఏఐ), తమిళనాడులోని వినాయక మిషన్‌ రీసెర్చి ఫౌండేషన్‌ సంస్థలు 2001 నుంచి ఇచ్చిన డిగ్రీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ డిగ్రీలను వెనక్కి తీసుకొని వాటిని రద్దు చేయాలని, ఆ డిగ్రీల ద్వారా సంబంధిత అభ్యర్థులకు ఇచ్చిన పదోన్నతులను ఉపసంహరించుకోవాలని, ఆర్థిక ప్రయోజనాలను తిరిగి వసూలు చేయకూడదని సూచించింది. అభ్యర్థులు చెల్లించిన బోధన రుసుము, ఇతరత్రా సొమ్మును మే 31లోగా తిరిగి చెల్లించాలని విద్యా సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. పాత తేదీలతో వర్తించే విధంగా ఈ నాలుగు సంస్థలకు డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల హోదా కల్పించిన యూజీసీ అధికారులపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. అలాంటి సంస్థలు ‘విశ్వవిద్యాలయం’ అన్న పదాన్ని ఉపయోగించుకోకుండా నిషేధిస్తూ నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ సమస్యతో పాటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల వ్యవహారాల పరిశీలనకు నెల రోజుల్లో త్రిసభ్య సంఘాన్ని నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నివేదిక అందిన నెలరోజుల్లో కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని, వచ్చే ఏడాది ఆగస్టు 31లోగా ప్రమాణ పత్రం సమర్పించాలని సూచించింది.