మహిళా ప్రయాణికుల భద్రత కోసం సరికొత్త యాప్‌

SMTV Desk 2017-11-03 18:33:06  Iwach Railways, app, mumbai, Western Railway Pervo Ravindra Bhaskar

ముంబయి, నవంబర్ 03 : దేశంలోని రైళ్లలో మహిళలపై ఆత్యాచారాలు పెరుగుతున్న తరుణంలో మహిళల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు పశ్చిమ రైల్వే(డబ్ల్యూఆర్‌) నడుం బిగించింది. బ్ల్యూఆర్‌కు చెందిన రైల్వే రక్షక దళం(ఆర్‌పీఎఫ్‌) మహిళా ప్రయాణికుల భద్రత కోసం సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘ఐవాచ్‌ రైల్వేస్‌’ పేరుతో ఉన్న ఈ యాప్‌ను అండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులు ప్లేస్టోర్‌ నుంచి, ఐఫోన్‌ వినియోగదారులు ఐ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పశ్చిమ రైల్వే పీఆర్వో రవీంద్ర భాస్కర్‌ తెలిపారు. ఐవాచ్‌ టెక్నాలజీస్‌ సంస్థ సాయంతో దీన్ని రూపొందించినట్లు వెల్లడించారు. ప్రమాదంలో ఉన్న మహిళా ప్రయాణికులు ఈ యాప్‌లో ఉండే అలర్ట్‌ బటన్‌ను నాలుగు సార్లు నొక్కితే ముంబయిలోని ఆర్‌పీఎఫ్‌ కంట్రోల్‌రూమ్‌తో పాటు ఎంపిక చేసిన ఎనిమిది మంది సంరక్షకులు, వైద్యులు, రక్షణ అధికారులకు లొకేషన్‌తో సహా ఎస్‌ఎంఎస్‌ వెళ్లిపోతుంది. బాధితురాలు ఆడియో, వీడియో పుటేజీని కూడా తక్షణం ఆర్‌పీఎఫ్‌ కాల్‌సెంటర్‌కు పంపించే వెసులుబాటు ఉంది. బాధితురాలి నుంచి హెచ్చరిక రాగానే ఆర్‌పీఎఫ్‌ అధికారులు సమీపంలోని సిబ్బందికి సమాచారం ఇస్తారు. దీంతో వీలైనంత వేగంగా రక్షించే అవకాశం ఉంటుందని భాస్కర్‌ తెలిపారు. అయితే యాప్‌ రైల్వే ప్రాంగణాల్లో ఉన్నప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ముంబయి చర్చిగేట్‌ స్టేషన్‌ నుంచి సబర్బన్‌ రైల్వేస్టేషన్లకు వెళ్లే మార్గాల్లో ప్రస్తుతం పని చేస్తుందని వెల్లడించారు. గత నెలలో ఆవిష్కరించిన ఈ యాప్‌ను ఇప్పటివరకు లక్ష మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సమాచారం.