కొత్త సచివాలయం కట్టి తీరుతాం : కేసీఆర్

SMTV Desk 2017-11-03 16:35:51  Secretariat construction, cm kcr, bison polo ground.

హైదరాబాద్, నవంబర్ 03 : బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెబుతూ తెలంగాణ ప్రజలకు కొత్త సచివాలయం నిర్మించి తీరుతామని తేల్చిచెప్పారు. దీనికి సికింద్రాబాద్ లోని బైసన్ పోలో మైదానంలో ప్రధాని మోదీతో పునాది రాయి వేయించి 500 కోట్లతో చారిత్రక కట్టడంగా తెలంగాణ ప్రజలకు అందిస్తామన్నారు. ఇప్పుడున్న సచివాలయం దేశంలోనే చెత్త సచివాలయమని, ఇది హరిత, అగ్నిమాపక ప్రమాణాలకు అనుగుణంగా లేదని చెప్పారు. ఇందులో సిఎం ఛాంబర్, చీఫ్ సెక్రటరీ ఛాంబర్, కేబినెట్ హాల్, వీడియో కాన్ఫరెన్సు హాల్ అన్ని ఒకే భవనంలో ఉన్నాయని, ఇది ఇబ్బందికర పరిస్థితి అని తెలిపారు. ఇప్పుడున్న అసెంబ్లీ ఎప్పుడో నిజాంలు కట్టిందని, మధ్యలో చెన్నారెడ్డి హయాంలో కొత్త భవనాలు కట్టారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో బైసన్ పోలో మైదానంలో గల 151 ఎకరాల స్థలంలో కొత్త సచివాలయం అన్ని హంగులతో నిర్మిస్తామని చెప్పారు. ఈ సచివాలయ సమూహంలో అసెంబ్లీ, మంత్రుల కార్యాలయాలు, తెలంగాణ కళా భవన్, అన్ని ప్రభుత్వ అధిపతుల కార్యాలయాలు నిర్మిస్తామన్నారు. ఈ 151 ఎకరాల స్థలంలోనే రాజీవ్ రహదారి విస్తరణ నిర్మిస్తామన్నారు. ఈ నిర్మాణాలన్ని 6 లక్షల చదరపు గజాల్లో నిర్మిస్తే, గజానికి 4 వేలు చొప్పున 240 కోట్లు ఖర్చు అవుతుందని, ఇది కూడా పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితులలో తెలంగాణ ప్రభుత్వం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. సచివాలయాలు ప్రభుత్వ గౌరవానికి, అస్తిత్వానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర సచివాలయ మార్పు తన ఒక్కడి నిర్ణయం కాదని, గతంలో నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రయత్నించారని గుర్తు చేశారు. ఈ భూమి రక్షణ శాఖ పరిధిలో ఉ౦దని గౌరవిస్తున్నామని, అందరి అనుమతితో అన్ని భవనాలు ఒకే చోట నిర్మించాలన్నది తమ అభిమతమని కేసీఆర్ తెలిపారు. సభలో బీజేపీ సభ్యులు లక్ష్మణ్, కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రభుత్వం అనసర ఖర్చుకు పోతుందని, ఉన్న సచివాలయానికి మార్పులు చేస్తే సరిపోతుందని సూచించారు. క్రీడా మైదానాలను ప్రభుత్వం ద్వ౦సం చేస్తు౦దని, ఇది ఏ మాత్రం ప్రజా అంగీకారం కాదని వారు తెలిపారు. దీనికి కేసీఆర్ స్పందిస్తూ బైసన్ పోలో మైదానంలో సచివాలయ నిర్మాణానికి కేంద్ర అనుమతి కోరామని, వారు సానుకూలంగా స్పందించారని, తమాషా చేస్తే కోర్టుకు వెళ్తామని తెలిపారు. ప్రతిపక్షాలు చెప్పినట్లు చేయడానికి మేము ఇక్కడ లేమని, మా ఆలోచన మాకు౦దని, నిర్మాణాత్మక సూచనలు చేస్తే తప్పకుండా తీసుకుంటామని, ఇది మంచిదా, కాదా అనేది ప్రజా కోర్టులో తేల్చుకు౦టామన్నారు.