రైతులకు కష్టాలు రానివ్వద్దు : కేసీఆర్

SMTV Desk 2017-11-03 16:07:20  assembly, cm kcr, farmers, current

హైద‌రాబాద్, నవంబర్ 03 ‌: రైతులకు నిరంతరం విద్యుత్ అందించాలని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ పవర్ ప్లాంట్ల నిర్మాణం, వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ సరఫరాపై అసెంబ్లీలో అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది మార్చి నుంచి రైతుల వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్ అందించాలని సీఎం తెలిపారు. 2018 నుంచే అదనంగా మరో 3500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడనుందని సీఎం అన్నారు. నాలుగు వేల మెగావాట్ల దామరచర్ల అల్ట్రా పవర్ ప్రాజెక్టును మూడేళ్లలోపు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే 4వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. భూసేకరణ, పర్యావరణ అనుమతులు పూర్తయినందున త్వరతగతిన పనులు పూర్తి చేయాలని, ఎత్తిపోతల పథకాలు, పరిశ్రమలు, మిషన్ భగీరథ, మెట్రోరైలు తదితర ప్రాజెక్టులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.