చెన్నైను వణికిస్తున్న భారీ వర్షాలు

SMTV Desk 2017-11-03 13:39:19  RAINS, CHENNAI, TAMILNADU, TAMIL NADU GOVERNMENT,

చెన్నై, నవంబర్ 3 : గత రెండు సంవత్సరాల తర్వాత చెన్నైలో కురుస్తున్నభారీ వర్షాలకు నగర౦ మొత్తం అతలాకుతలమవుతోంది. ఈ భారీ వర్షాలకు ఎక్కడికక్కడ జన జీవనం స్తభించిపోయి లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఇప్పటికే 155 పైగా శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నై సౌత్ జోన్ ప్రాంతంలో ఈ వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 18 సెంటీ మీటర్లు వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదయ్యింది. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఆరోపించారు. నగరంలో రోడ్లన్ని నదులను తలపిస్తున్నాయి. వర్షంతో పాటు భారీగా ఈదురు గాలులు రావడంతో చెట్లు కుప్పకూలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగు నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వర్షాల కారణంగా కొన్ని రైళ్లను నిలిపివేశారు. అంతేకాదు విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది. తమిళనాడు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవు ప్రకటించాలని అధికారులకు ఆదేశించింది. మరో 48 గంటలపాటు వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.