భూటాన్‌ రాజు వాంగ్‌చుక్‌తో సమావేశమైన ఉపరాష్ట్రపతి

SMTV Desk 2017-11-03 10:57:11  Bhutan is the Vice President of the Vanguchk meeting, delhi, Venkiah Naidu

న్యూఢిల్లీ, నవంబర్ 03 : భూటాన్‌ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి భారత్‌ సహకరిస్తుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తెలిపారు. దేశంలో పర్యటిస్తున్న భూటాన్‌ రాజు జిగ్మే ఖెసర్‌ నామ్‌గ్యెల్‌ వాంగ్‌చుక్‌తో గురువారం ఆయన సమావేశమయ్యారు. భారత్‌-భూటాన్‌ల భద్రతా సమస్యలు విడదీయరానివి, పరస్పరం ముడిపడి ఉన్నవని ఉపరాష్ట్రపతి అన్నారు. భూటాన్‌ అభివృద్ధికి భారత్‌ తన అనుభవాన్ని, విజ్ఞానాన్ని, వనరులను అందజేస్తుందని చెప్పారు. తక్కువ ఖర్చుతో సకాలంలో జలవిద్యుత్తు ప్రాజెక్టులను అమలు చేయడం రెండు దేశాలకూ చాలా ముఖ్యమైన విషయమన్నారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదే కీలక అంశమని, పొరుగుదేశాల మధ్య ఉండాల్సిన సంబంధాలకు ఇది ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. చారిత్రక, సాంస్కృతిక సంబంధాల కారణంగా రెండుదేశాలు సహజ మిత్రులు, భాగస్వాములుగా ఎదుగుతున్నాయని చెప్పారు. ప్రత్యేక సంస్కృతి, పర్యావరణాన్ని కాపాడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని భూటాన్‌ రాజును ప్రశంసించారు. రాజవంశం దూరదృష్టి కారణంగానే రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడుతున్నాయని అన్నారు. తాను ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపడుతున్న సమయంలో అభినందిస్తూ లేఖ రాసినందుకు వాంగ్‌చుక్‌ కు వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఇరుదేశాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.