కాంగ్రెస్‌ ఇప్పుడు లాఫింగ్‌ క్లబ్‌ : మోదీ

SMTV Desk 2017-11-02 14:54:45  Kangra in Himachal Pradesh, modi, congress, rahulgandhi

కంగ్రా, నవంబర్ 02 : కాంగ్రెస్‌ ఇప్పుడు లాఫింగ్‌ క్లబ్‌ అయ్యిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగ్రాలో జరిగిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హిమాచల్‌ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ ఆ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో మాత్రం అవినీతికి వ్యతిరేకంగా పోరాడతామని అంటున్నారు. ఈ విషయాన్ని కనీసం చిన్న పిల్లలు సైతం నమ్మరు. కాంగ్రెస్‌ ఇప్పుడు లాఫింగ్‌ క్లబ్‌ అయ్యిందని మోదీ విమర్శించారు. డోక్లామ్‌ వివాదం నుంచి ఎలా బయటపడ్డామనే విషయం దేశమంతా తెలుసు. కానీ కాంగ్రెస్‌ మాత్రం దానిని ప్రశ్నిస్తూనే ఉందని పరోక్షంగా రాహుల్‌ నుద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. అమరవీరుల త్యాగాన్ని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఓ కాంగ్రెస్‌ నేత కశ్మీర్‌ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతున్నారని మరోసారి పరోక్షంగా చిదంబరంను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఐదు భూతాలు పట్టిపీడిస్తున్నాయని.. మైనింగ్‌, అటవీ, మాదకద్రవ్యాలు, టెండర్‌, బదిలీ మాఫియాలు రాష్ట్రంలో పాతుకుపోయాయని వాటిని నిర్ములించాల్సిన సమయం దగ్గరలోనే ఉందని మోదీ వెల్లడించారు.