పోలవరంకు వివాద పరిష్కార బోర్డు..

SMTV Desk 2017-11-02 12:02:32  polavaram project, Dispute Resolution Board, Water Resources Minister, Umamaheswara Rao

అమరావతి, నవంబర్ 02 : ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ వివాద పరిష్కార బోర్డు ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్లు జలవనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు, సమాచార మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఈ బోర్డు గుత్తేదారుకు, జలవనరుల శాఖకు మధ్య చెల్లింపులలో వచ్చే వివాదాలను పరిష్కరి౦చనుంది. పోలవరం ప్రాజెక్ట్ ను 2018 వరకు పూర్తి చేయడానికి ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉంటే, కనులుండి కూడా చూడలేని వారు విమర్శిస్తున్నారని ఉమా పేర్కొన్నారు. 50శాతానికి పైగా పోలవరం పని జరగగా, 35శాతం హెడ్ వర్క్స్ పని జరిగిందన్నారు. కేంద్రం సూచన మేరకు డీఏబి ఏర్పాటు చేసి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసామన్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన తరువాత రూ.7329 కోట్లు ఖర్చు చేయగా, అందులో కేంద్రం రూ.4329 కోట్లు ఇచ్చి౦దన్నారు. రూ.50 కోట్లుగా ఉన్న పోలవరం ప్రత్యేక నిధిని రూ.150 కోట్లకు పెంచారు. అత్యవసర చెల్లింపులు ఆలస్యం కాకుండా పర్యవేక్షక అధికారి ఈ నిధి నుంచి చెల్లింపులు చేస్తారని మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. ప్రతిపక్షాలు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్ ల విషయంలో అనవసర రాద్దాంతం చేయవద్దని సూచించారు.