అమెరికాలో ఉగ్ర కలకలం.. 8 మంది మృతి

SMTV Desk 2017-10-31 19:05:37  New York terrorist attack, Truck Attack, 8 Members dead, Trump condemns,

న్యూయార్క్, నవంబర్ 01 : అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎంతో సంతోషంతో హాలోవీన్ వేడుకలు జరుపుకుంటుండగా ఓ దుండగుడు ట్రక్కుతో పెను భీభత్సం సృష్టించాడు. న్యూయార్క్ లోని మాన్ హట్టన్ లో అద్దెకు తీసుకున్న ట్రక్కుతో 29 సంవత్సరాల దుండగుడు డబ్ల్యూటీసీ స్మారక చిహ్నం ప్రాంతానికి రాగానే ఒక్కసారిగా ఆ ట్రక్కును సైకిల్లు వెళ్ళే ప్రాంతానికి మళ్లించాడు. కనిపించిన వారందరిని తన ట్రక్కుతో ఢీకొన్నాడు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా దాదాపు 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని ఆ ట్రక్ డ్రైవర్ పై కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. భద్రత సిబ్బంది గాయపడిన వారికి సహాయక చర్యలు చేపట్టి వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కాల్పులు జరిపిన ఆ దుండగుడు 2010లో అమెరికాకు వలస వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇతను ఫ్లోరిడాలో నివసిస్తున్నట్లు సమాచారం. కాగా దాడి జరిపిన ఆ ట్రక్కులో ఐసిస్ కు సంబంధించి ఒక లేఖను అధికారులు గుర్తించారు. కచ్చితంగా ఇది ఉగ్రదాడేనని న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లసియో తెలిపారు. దీనిపై భద్రత సిబ్బంది విచారణ చేపట్టారు. ఈ ఘటనపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.