పరుల సమస్యల పరిష్కారం సులువు- స్వంత సమస్యలే ఎంతో బరువు...

SMTV Desk 2017-10-31 18:00:15  Problems, Psychology, hyderabad

హైదరాబాద్, అక్టోబర్ 31 : ఇది వరలో ఒక నాయకుడు సాంకేతిక రంగానికి పెద్దపీట వేస్తూ, సామాజిక శాస్త్ర అధ్యయనాల ఆవశ్యకత లేదనటం, దీనిపై ఎందరో ప్రముఖులు విమర్శలు చేయటం కొందరికైనా గుర్తుండేవుంటుంది. ఇప్పటీకి విదేశాలలో ప్రముఖ విశ్వవిద్యాలయాలు పలు అంశాలపై ప్రజల భావాలను క్రమపద్ధతిలో సేకరించి, వాటిని సూత్రబద్ధంగా విశ్లేషించి మన ముందుంచుతున్నాయి. ఇటీవల కెనడాకు చెందిన వాటర్ లూ విశ్వవిద్యాలయం కొన్ని వందల మందికి కొన్ని ప్రశ్నలనిచ్చి వారి సమాధానాలను సేకరించి విశ్లేషించిన అంశం మనకు తెలిసింది. మనలో చాలా మంది మనకు సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించటానికి తలపట్టుకుంటాం. ఎన్నో విషయాల గురించి ఆలోచించినా సరైన సమాధానం దొరకదు. అదే మనకు బాగా పరిచయమున్నవారు, మిత్రులు, బంధువులు ఏదైనా ఇబ్బంది వచ్చి పాలు పోనీ స్థితిలో వుంటే వారికి చేయూతనిచ్చేలా సమాధానం లభించేలా విజ్ఞత కనబరచగలం. ఇదే విశ్వవిద్యాలయ విశ్లేషణలో కూడా తేలింది. ఇతరులకు సాయమనేటపుడు కొన్ని పట్టింపులకు మనం దూరంగా ఉంటాం. అందువలన సముచితమైన సాయం అందించటం సునాయసమవుతుంది. అదే మనకు సమస్య వచ్చినపుడు వ్యక్తిగత పట్టింపులు, పంతాలు వంటివి కూడ ముందు వరుసలో చేరతాయి. అందువలన ఒక పట్టాన ఏమి చేయాలో అర్ధంకాదు. అంతేకాక కొన్ని సామాజిక విలువల విషయంలో ఇతరుల పట్ల చూపే విధంగా మనకు మనం అన్వయించుకోనటం నామోషిగా కూడ ఉండవచ్చు. కనుక మన సమస్యలను కూడ ఇతరుల సమస్యలాగ భావించి పరిష్కారం కోసం వెదికితే బాగుంటుందేమో!