నేడు ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి....

SMTV Desk 2017-10-31 17:01:19  National unity day, Sardar Vallabhbhai Patel, modi, delhi

న్యూఢిల్లీ, అక్టోబర్ 31 : ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే అఖండ భారత్ సాధ్యమైందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నేడు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన జాతీయ ఐక్యత దినోత్సవంలో పాల్గొన్న మోదీ, నవభారత్‌ నిర్మాణంలో సర్దార్‌ పటేల్‌ కృషి మరవలేనిదన్నారు. సర్దార్ ధృడ సంకల్పం దీర్ఘ దృష్టి, అసమాన ధైర్యం వల్లే భారత్ ఐక్యంగా నిలువ గలిగిందన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఐక్యత పరుగు నిర్వహించారు. ఈ పరుగును ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాని, హోంమంత్రితోపాటు ప్రముఖ క్రీడాకారులు కరణం మల్లేశ్వరి, దీపా కర్మాకర్‌, రైనా, సర్దార్‌సింగ్‌ జెండా ఊపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఎందరో కుట్రలను పటేల్‌ ఛేదించారని.. సామ, దాన, భేద, దండోపాయంతో దేశాన్ని సంఘటితం చేశారన్నారు. లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం మన దేశానికి ఉన్న ప్రత్యేకత అని వివరించారు. ఐక్యతా పరుగు కోసం యువత అధికంగా తరలి రావడం సంతోషంగా ఉందన్నారు. పటేల్‌ త్యాగాలను యువత గౌరవించడం దేశాన్ని బలపరచడంలో భాగమేనన్నారు.