ప్రజాస్వామ్యంపై చర్చించాలంటూ మోదీ సూచన....

SMTV Desk 2017-10-29 10:51:36  Indian Prime Minister Narendra Modi, BJP head quarters delhi, media

న్యూఢిల్లీ, అక్టోబర్ 29 : దేశ భవిష్యత్తు కోసం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అభివృద్ధి చెందాల్సిన అవసరముందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శనివారం జర్నలిస్టుల కోసం ‘దీపావళి మంగళ్‌ మిలన్‌’కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, పలువురు కేంద్ర మంత్రులు జర్నలిస్టులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ...పార్టీల్లో నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటే అది దేశ భవిష్యత్తుకే కాకుండా, ప్రజాస్వామ్యానికి కూడా మంచిదని పేర్కొన్నారు. ఆయన ఏ పార్టీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయకపోయినా, కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను సోనియా గాంధీ బదులు రాహుల్‌ గాంధీ చేపడుతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భాజపాలో పలు అభిప్రాయాలకు తావుందని, అయితే కేంద్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు ఒకే విధమైన భావజాలం ఉంటుందన్నారు. పలు రకాల అభిప్రాయాలు వెల్లడికి అవకాశం ఉన్నందునే భాజపా బలపడిందని చెప్పారు. స్వచ్ఛ్‌ భారత్‌కు మీడియా అందిస్తున్న సహకారానికి మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం అమలవుతున్న తీరుపై చర్చ జరగాలని ప్రధాని సూచించారు.