ఏపీ శాసన సభలోకి నీరు...ప్రతిపక్షాల మండిపాటు

SMTV Desk 2017-06-09 10:35:53  apassambley, rain water, speekar kodela shivaprasad,

అమరావతి, జూన్ 09 ‌: ఆంధ్రప్రదేశ్ శాసన సభలోకి నీరు చేరడం పై ప్రతిపక్షాలు గగ్గోలు పుట్టించాయి. నిర్మాణ లోపాలు, అవకతవకల వల్లే కొద్దిపాటి వర్షానికే శాసన సభలోకి నీరుచేరిందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు శాసన సభ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. వారు నోటికి నల్లరిబ్బేన్ లు ధరించి తమ నిరసనను, ఆందోళనను వ్యక్తం చేశారు. శాసన సభ నిర్మాణం పూర్తిగా లోపభూయిష్టంగా జరిగిందని, ఆ కారణంగా మీడియాను లోనికి అనుమతించకుండా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష శాసన సభ్యులు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా విపక్షనేత జగన్మోహన్ రెడ్డి గది సీలింగ్ నుండి నీళ్లు కారడం వెనుక విద్రోహ చర్య ఉందా అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది. శాసన సభలో ఎక్కడా చుక్కనీరు రాలేదు, కేవలం జగన్ కార్యాలయంలోకే ఎందుకు నీరోచ్చింది..ఆయన కార్యాలయం పై భాగంలో ఉన్న ఏసీ పైపును కోయడంతోనే నీరు లోపలికొచ్చింది..ఆయన కార్యాల యానికి చెందిన ముగ్గురు ఉద్యోగులు అసెంబ్లీలో రోజు తిరిగేందుకు అనుమతి ఉంది. వారైనా, లేదా వారితోమరేవరైనా చేయించారా అనేది తేలాలి.. సీఐడీ విచారణకు ఆదేశించాం, బాధ్యులెవరో తేలుస్తామంటూ శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు స్పష్టం చేశారు. వర్షపునీరు సీలింగ్ నుండి లీకయితే గోడలపై చారలుండాలి కదా..గుమ్మరించినట్లుగా ఒకే చోట నీళ్లేందుకు పడతాయి..దీన్ని బట్టే ఎవరో కావాలనే చేశారని అర్థమవుతోంది. భవనాలను లోపభూయి ష్టంగా నిర్మించారు, నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారు. చట్టసభ ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత సభాపతిగా నాపై ఉంది. పైపు ఎవరు కోశారనేదీ సీసీ టీవీ పుటేజీల ద్వారా పరిశీ లిస్తాం, ఆధారాలను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కి కూడా పంపి నిర్ధారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు.