కాలుష్యాన్ని నియంత్రించేందుకు మళ్లీ సరి-బేసి విధానం...

SMTV Desk 2017-10-26 18:39:31  even-odd approach, delhi, supreem court, pollution

న్యూఢిల్లీ, అక్టోబర్ 26 : ఇటీవల ఢిల్లీ-ఎస్‌సీఆర్‌ పరిధిలో బాణసంచా వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాలుష్యాన్ని నియంత్రిచేందుకు డీజిల్‌ జనరేటర్ల వినియోగంపై నిషేధం విధించడంతో పాటు, బదర్‌పూర్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను మూసివేయాల్సిందిగా కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కాలుష్యాన్నినియంత్రించేందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోంది. గతేడాది ఆప్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరి-బేసి విధానాన్ని మళ్లీ అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. సరి-బేసి విధానాన్ని తీసుకురావడం వల్ల రోడ్లపై కార్ల సంఖ్య తగ్గుతుందని, దీని వల్ల కాలుష్యం కొంత మేర తగ్గే అవకాశం ఉందని రవాణాశాఖ మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌(డీటీసీ), సీనియర్‌ అధికారులకు లేఖలు రాశారు. సరి-బేసి విధానాన్ని ప్రవేశపెడితే ఢిల్లీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన లేఖ ద్వారా సూచించారు. ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరుగుతోంది. అందువల్ల అత్యవసర ప్రమాణాలను పాటించడంతో పాటు సరి-బేసి విధానాన్ని కూడా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.