రూ.7 లక్షల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి.....

SMTV Desk 2017-10-25 18:39:12  Union Finance Minister Arun Jaitley, Prime Minister Narendra Modi, GST, Cancellation of banknotes, DELHI

న్యూఢిల్లీ, అక్టోబర్ 25 : గత మూడేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా భారత్‌ నిలుస్తూ వస్తోందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ హర్షం వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీల కారణంగా గణాంకాలు తారుమారు అవుతున్నాయనే విమర్శల్ని తిప్పికొట్టడానికి వీలుగా సుమారు రూ.7 లక్షల కోట్లతో జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తద్వారా పెద్దఎత్తున ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థిక రంగానికి వూతమివ్వబోతోంది. దీంతోపాటు మొండి బకాయిలతో ఆందోళన చెందుతున్న బ్యాంకింగ్‌ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున రూ.2 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని వాటికి మూలధనంగా ఇవ్వబోతోంది. దీనికి సంబంధించిన నిర్ణయాలను మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తమ శాఖ ఉన్నతాధికారులందరితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తాజా ఆర్థిక పరిస్థితుల్ని, దానిని మార్చేందుకు తాము చేపట్టబోతున్న చర్యల్ని ప్రకటించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదుల మీద నిర్మితమై ఉందని జైట్లీ వెల్లడించారు. రూ.1.35 లక్షల కోట్లను బాండ్ల రీక్యాపిటలైజేషన్‌ ద్వారా, రూ.76,000 కోట్లను బడ్జెట్‌ మద్దతుద్వారా పొందనున్నారు. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలలో ఈ మూలధనం ఇస్తామని జైట్లీ తెలిపారు. ఈ నిర్ణయం సాహసోపేతం, అసాధారణమని చెప్పారు. మూలధనం ఇవ్వడమే కాకుండా.. వచ్చే కొద్ది నెలల్లో బ్యాంకింగ్‌ సంస్కరణలను కూడా తీసుకురానున్నట్లు ఆయన స్పష్టం చేశారు.