రేవంత్ చేసిన వ్యాఖ్యల పై పయ్యావుల స్పందన...

SMTV Desk 2017-10-24 19:14:52  revanth Comments, payyavula keshav

అమరావతి, అక్టోబర్ 24 : తెలంగాణ, తెలుగుదేశం యువ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలు ఎంతో బాధించాయన్న పయ్యావుల ఆయన జైలుకు వెళ్లిన సమయంలో మొదట స్పందించింది తానేనని తెలిపారు. కుమార్తె వివాహానికి పార్టీ మొత్తం ఏకధాటి పై నిలిచి రేవంత్ కుటుంబానికి అండగా నిలిచామని గుర్తు చేశారు. 5 ఏళ్లుగా పార్టీలో సైనికుడిలా పనిచేస్తున్నాని పయ్యావుల చెప్పారు. చంద్రబాబు ప్రోత్సాహం వల్లే తాను, రేవంత్‌ ఈ స్థాయికి ఎదిగామన్నారు. తనకంటే రేవంత్‌ను చంద్రబాబు ఎక్కువగా ప్రోత్సహించారని చెప్పారు. ఆరు నెలలుగా రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై తన వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని తెలిపారు. ఆయన చంద్రబాబును కలిశాకే ఆ వివరాలపై స్పందిస్తానని అన్నారు. రేవంత్‌కు వ్యక్తిగత అజెండాలే ప్రధానమని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వంతో తనకు లంకె పెట్టడం దుర్మార్గమని పయ్యావుల మండిపడ్డారు. రేవంత్‌ వ్యాఖ్యల వల్ల తనకంటే ఆయనకే ఎక్కువ నష్టమని పేర్కొన్నారు. తనకు, ఏపీ మంత్రి సునీతకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణలో తనకు ఒక్క రూపాయి వ్యాపారం లేదని.. హైదరాబాద్‌లో ఒక్క ప్లాటు కూడా లేదని పేర్కొన్నారు. లేని నా వ్యాపారాలపై మాట్లాడే ముందు రేవంత్‌ తన వ్యాపారాల గురించి మాట్లాడాల‌ని కోరారు.