రూ.200 కోట్లకు చేరుకున్న హరికేన్‌ బాధితుల విరాళాలు

SMTV Desk 2017-10-23 18:39:20  Hurricane storm, Former US Presidents to Collect Donations, tramp

ఆస్టిన్, అక్టోబర్ 23 : ఇటీవల విధ్వంసం సృష్టించిన హరికేన్‌ తుఫాను బాధితులకు సహాయార్థం చేపట్టిన విరాళాల సేకరణకు అమెరికా మాజీ అధ్యక్షులు ఐదుగురు పార్టీకతీతంగా ఒక్కటయ్యారు. టెక్సాస్‌లోని ఏఅండ్‌ఎం విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజ్‌స్టేషన్‌లో నిర్వహించిన సంగీత విభావరిలో పాల్గొన్నారు. టెక్సాస్‌, ఫ్లోరిడా, లూసియానా, ప్యూర్టారికొ, యూఎస్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌లో విరుచుకుపడిన హరికేన్ల కారణంగా నష్టపోయిన బాధితుల కోసం సహృదయత చూపారు. మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, బిల్‌ క్లింటన్‌, జిమ్మీకార్టర్‌, జార్జి హెచ్‌.బుష్‌, జార్జి డబ్ల్యూ.బుష్‌ పాల్గొన్న ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా మాట్లాడారు. 93 ఏళ్ల వయస్సులో పార్కిన్సన్‌ వ్యాధితో కుర్చీలో నుంచి లేవలేకపోతున్నా సీనియర్‌ బుష్‌ ఈ కార్యక్రమానికి హాజరవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. సెప్టెంబరు 7 నుంచి ప్రారంభించిన విరాళాల సేకరణలో ఇప్పటివరకు దాదాపు రూ.200 కోట్లు వచ్చినట్లు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్‌ ప్రతినిధి జిమ్‌ మెక్‌గ్రాత్‌ వెల్లడించారు.