ఆత్మాహుతి దాడితో భీతిల్లిన ఇరాన్

SMTV Desk 2017-06-08 13:14:37  iran, teharane, parlament, terrorist attack

టెహ్ రాన్, జూన్ 08‌ : ఆత్మాహుతి దాడితో ఇరాన్ రాజధాని టెహ్ రాన్ భీతిల్లింది. అత్యంత పకడ్భంది భద్రత ఉండే పార్లమెంట్ భవనంతో పాటు ఆయతుల్లా రుహుల్లా ఖొమైనీ సమాధినీ లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రాణనష్టం పరిమితంగా ఉన్నప్పటికి వారి దాడి లక్ష్యం మాత్రం వణుకు పుట్టించింది. ఇరాన్ రాజధాని టెహ్ రాన్ లో ఆత్మాహుతి దళ సభ్యులు, సాయుధులు దాడిలో పాల్గొన్నారు. వారంతా మహిళా దుస్తులు ధరించి సందర్శకుల మాదిరిగా పార్లమెంటు ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని తమను తాము పేల్చేసుకున్నారు. ఆ సమయంలో పార్లమెంట్ సమావేశం జరుగుతోంది. నాలుగో అంతస్తుకు చేరుకున్న కొందరు ఉగ్రవాదులు అక్కడి నుంచి తమకు కనిపించినవారిపై కాల్పులు జరిపారు. వీరిలో ఒకరిని భద్రతా దళాలు కాల్చిచంపగా, మరొకరు నడుం చుట్టూ అమర్చున్న బాంబును పేల్చివేసుకున్నట్లు వెల్లడయింది. ఇందుకు కారణమైన నలుగురూ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ వార్తా సంస్థ వెల్లడించింది. భవనం లోనక్కి ఉన్న సాయుధుల్ని మట్టుబెట్టడానికి దాదాపు 5 గంటల సమయం పట్టిందని ఆ సంస్థ పేర్కొంది. పార్లమెంటు పై దాడి జరుగుతుండగా మరో ఆత్మాహుతి సభ్యుడు టెహ్ రాన్ కు దక్షిణాన ఉన్న ఆయతుల్లా ఖొమైనీ సమాధి వద్ద తనను తాను పేల్చేసుకున్నాడు. అక్కడే ఉన్న మరో ముష్కరుడిని భద్రత దళాలు కాల్చేశాయి. ఇక మూడో చోట దాడికి కుట్ర పన్నుతున్న ఉగ్రవాద ముఠాను అరెస్టు చేశారు. ఇరాక్, సిరియాల్లో విస్తరిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులపై దాడులు చేస్తున్న దేశాల్లో ఇరాన్ ఉండడంతో ..ఇరాన్ లక్ష్యంగా దాడులు చేయాలని ఇస్లామిక్ స్టేట్ సంస్థ పిలుపు నిచ్చింది. ఇరాన్ అధ్యక్షులుగా హసన్ రౌహనీ తిరిగి ఎన్నికయిన నెలరోజుల్లోనే దాడులకు పాల్పడడం ఇరాన్ లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకొంది. పార్లమెంటు లోపలకు సాయుధులు చొరబడటం, ఒకరు గాయాలతో పడి ఉండడం వంటి దృశ్యాలతో 24 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ఆ సంస్థ విడుదల చేసింది. ఓ దైవమా ..నీకు ధన్యవాదాలు..మేం వదిలేస్తామని నువ్వు అనుకుంటున్నావేమో..లేదు దైవ సంకల్పాన్ని మేం నెరవేరుస్తామని అని అర్థం వచ్చే ఆడియో సందేశాన్ని కూడా జత చేశారు.