డీఆర్‌ఎంలకు మరో రెండేళ్ల పాటు అధికారం

SMTV Desk 2017-10-20 16:11:07  DRM, Railway board, Authority for two years

న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : ఇకపై రైల్వే ఉద్యోగులకు రిటైరైన తరువాత కూడా మరో రెండేళ్లపాటు సేవల్ని వినియోగించుకునేందుకు కావాల్సిన అధికారాలను డివిజనల్‌ రైల్వే మేనేజర్లకు రైల్వేబోర్డు కల్పించింది. రైల్వే వెబ్‌సైట్లలో తగినంత ప్రచారం కల్పించి వీరిని తీసుకోవచ్చు. ఇలా నియమితులైన వారు తమకు 62 ఏళ్లు నిండేవరకు మాత్రమే కొనసాగడం వీలవుతుంది. ప్రస్తుతం రైల్వే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లు. అంటే గరిష్ఠంగా రెండేళ్లపాటు సేవలు అందించవచ్చు. ఉద్యోగిగా ఉన్నప్పుడు చివరి నెలలో తీసుకున్న జీతం నుంచి పింఛన్‌ మొత్తాన్ని మినహాయించి, ఇలాంటి వారికి పారితోషికాన్ని నిర్ణయిస్తారు. డీఆర్‌ఎంలు తమ విచక్షణ ప్రకారం పింఛన్‌దారుల్ని తీసుకోవచ్చని ఈ నెల 16న ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. 2018 సెప్టెంబరు 14 వరకు ఇలా నియామకాలు చేపడతారు.