జవాన్లతో దీపావళి..... ప్రధాని మోదీ

SMTV Desk 2017-10-20 12:43:45  Diwali with jawan, modi, jammukashmir

న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : భారత ప్రధాని నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్‌లోని గురెజ్‌ సెక్టార్‌లో జవాన్లతోకలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. జమ్ముకశ్మీర్ లోని నియంత్రణ సమీపంలో సముద్ర మట్టానికి ఎనిమిదివేల అడుగుల ఎత్తులో ఉన్నగురెజ్ వ్యాలిలో మోదీ వెలుగుల పండుగ సందర్భంగా జవాన్లందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి వారికి స్వయంగా మిఠాయిలు తినిపించారు. సైనికులతో సమయాన్ని గడిపితే తనలో కొత్త ఉత్సాహం వస్తుందని ఆయన అన్నారు. రెండు గంటల పాటు సైనికులతో మోదీ గడిపారు. ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుంటూ ఎంతో సహనంగా విధులు నిర్వర్తిస్తున్నందుకు జవాన్లను ఆయన అభినందించారు. దేశం కోసం జవాన్లు ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారని కొనియాడారు. ‘దీపావళి వేడుకలను కుటుంబంతో కలిసి జరుపుకోవాలని అనుకున్నాను. అందుకే మీ దగ్గరికి వచ్చాను. మీరే నా కుటుంబం’ అని మోదీ పేర్కొన్నారు. సైనిక సిబ్బంది సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని ఈ సందర్భంగా ప్రధాని తెలియజేశారు. మాజీ సైనికుల కోసం ప్రవేశపెట్టిన ఒకే ర్యాంకు ఒకే పింఛను విధానం గురించి ఆయన ప్రస్తావించారు. ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందిన సైనికులు యోగా శిక్షకులుగా మారి అద్భుతమైన సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. సైనికులారా.. మీరు ధైర్యానికి, అంకితభావానికి చిహ్నాలు. అటువంటి మీతో దీపావళి వేడుకలు జరుపుకునే అవకాశం నాకు దక్కింది. మీరు కోట్లాదిమంది భారతీయులకు సరికొత్త శక్తిని ఇస్తున్నారు’ అంటూ మోదీ అక్కడి విజిటర్స్‌ బుక్‌లో సైనికులనుద్దేశించి రాశారు. ప్రధాని మోదీ వెంట ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఇతర సైన్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.