ఇక్కడ గబ్బిలాలను దైవంగా భావిస్తారట...

SMTV Desk 2017-10-20 12:02:25   Bats village, ovvaal thoppu village, tamilanadu updates

తమిళనాడు, అక్టోబర్ 20 : సాధారణంగా పలు ప్రాంతాల్లో గబ్బిలాలను దెయ్యంగా భావిస్తారు. అవి ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చి తిరిగి వెళితే ఆ ఇంటికి ఏదో కీడు సోకుతుందని భావిస్తారు. కానీ దీనికి విరుద్దంగా తమిళనాడులో గబ్బిలాలను దైవంగా భావిస్తున్నారు. సేలం జిల్లాలో ఒవ్వాల్ తోప్పు గ్రామంలో పలు చింతచెట్లు ఉన్నాయి. వాటికి ఒక్కో చెట్టుకు వందల సంఖ్యలో గబ్బిలాలు వేలాడుతూ ఉంటాయి. ఇక్కడ అవి ఉండటం వల్లే ఈ ప్రాంతానికి ఒవ్వాల్ తోప్పు అని పేరు వచ్చింది. ఒవ్వాల్ తోప్పు అనగా తమిళంలో గబ్బిలాల తోపు అని అర్ధం. స్థానికులు గబ్బిలాలు ఇక్కడ ఉండటం తాము చేసుకున్న పుణ్యంగా భావిస్తారు. ఈ తోపులోని ఆలయంలో దేవునికి పూజలు నిర్వహించిన తరువాత ప్రసాదాన్ని ఈ గబ్బిలాలకు పెడుతుంటారు. ఈ ప్రాంతాన్ని చూడటానికి పలు ప్రాంతాల నుండి ప్రజలు వచ్చినప్పటికీ వాటికీ ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని సందర్శకులకు ముందుగానే షరతులు విధిస్తారు. ఈ గ్రామంలో ఎటువంటి బాణసంచా పేలుళ్లు, మంగళ వాయిద్యాల శబ్దాలు లేకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకోసం దీపావళి పండుగను కూడా ఇక్కడి స్థానికులు త్యాగం చేశారు. ఎవరైనా టపాసులు కాల్చుకోవాలి ఉత్సాహం చూపితే ఊరికి దూరంగా వెళ్లి పేల్చుకోవాల్సిందే.